పెద్దల సమక్షంలో నిశ్చితార్థం.. ఇంకొన్ని నెలల్లో పెళ్లి అనగా దారుణం

Tragedy In Wayanad Landslides Incident: వారి మతాలు వేరే.. కానీ మనసులు ఒక్కటయ్యాయి. పెద్దలు కూడా వారి వివాహానికి అంగీకరించారు. పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగింది. ఇంకొన్ని నెలల్లో పెళ్లి అనగా వయనాడ్ విలయతాండవం విషాదం నింపింది.

Tragedy In Wayanad Landslides Incident: వారి మతాలు వేరే.. కానీ మనసులు ఒక్కటయ్యాయి. పెద్దలు కూడా వారి వివాహానికి అంగీకరించారు. పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగింది. ఇంకొన్ని నెలల్లో పెళ్లి అనగా వయనాడ్ విలయతాండవం విషాదం నింపింది.

కేరళలోని వయనాడ్ లో నెల రోజుల క్రితం ప్రకృతి చేసిన విలయతాండవాన్ని ఎవరూ కూడా అంత సులువుగా మర్చిపోలేరు. మొత్తం దేశమంతా దిగ్భ్రాంతి చెందేలా ఎంతోమందిని మృత్యువాతకు గురి చేసింది.. తమ నివాసాలు కోల్పోయి ఎంతోమందిని రోడ్డున పడేలా చేసింది. ఇంత దయనీయ స్థితిలో కూడా ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఈఎంఐలు కట్టమని పీడించారు. క్షేమంగానే ఉన్నారా అయితే ఈఎంఐ కట్టండి అంటూ ఫోన్లు చేసి మరీ వేధించారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అరెస్ట్ చేశారనుకోండి అది వేరే విషయం. కానీ ప్రకృతి ప్రళయానికి వయనాడ్ జిల్లావాసులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటే లోన్ ఈఎంఐ కట్టమని అడగడం దేశమంతా ఆవేదన చెందేలా చేసింది. అయితే ప్రభుత్వ బ్యాంకు తీసుకున్న నిర్ణయం మాత్రం శభాష్ అనేలా చేసింది.

ఇల్లు, ఆస్తులు కోల్పోయిన వారి పేరు మీద, చనిపోయిన వారి పేరు మీద ఉన్న ఎలాంటి రుణాన్ని అయినా వాహన రుణమైనా, గృహ రుణమైనా, వ్యవసాయ రుణమైనా ఏదైనా గానీ మాఫీ చేస్తామని కేరళ బ్యాంకు తెలిపింది. నెల రోజుల పాటు నరకం చూసిన ప్రజలకు ఈ నిర్ణయం కాస్త ఉపశమనాన్ని కలిగించింది. ఇదిలా ఉంటే గుండె తరుక్కుపోయే ఘటన ఒకటి ఈ వయనాడ్ వరదల సమయంలో చోటు చేసుకుంది. ఓ కొత్త జంటకు వయనాడ్ విలయ తాండవం ఒక పెద్ద పరీక్షనే పెట్టింది. చూరాల్ మల గ్రామానికి చెందిన ఎస్. శృతి (24), ఆమె స్నేహితుడైన జెన్సన్ (27)లకు జూన్ 2న నిశ్చితార్థం జరిగింది. మతాలు వేరైనా గానీ ఇరువురి కుటుంబ సభ్యులు వీరి వివాహానికి అంగీకరించారు. డిసెంబర్ నెలలో వీరి వివాహం జరిపించాలని ఇరువురి కుటుంబ సభ్యులు నిశ్చయించారు. ఇక తమ పెళ్లి సవ్యంగా జరుగుతుందని భావించిన ఆ యువ జంటకు పెను విషాదమే ఎదురయ్యింది.

జూలై 30న వరదలు వయనాడ్ ని అతలాకుతలం చేసేశాయి. మట్టిచరియలు విరిగి పడడడంతో 9 మంది సజీవ సమాధి అయ్యారు. వారిలో శృతి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఆమె కుటుంబంలో శృతి ఒక్కర్తే బతికి ఉంది. ఈమె కోజికోడ్ జిల్లా సమీప హాస్పిటల్ లో అకౌంటెంట్ గా పని చేస్తుంది. ఇంతటి విషాదంలో తన స్నేహితుడైన జెన్సన్ ఆమెకు అండగా నిలిచాడు. కార్ల క్లీనింగ్ కంపెనీలో పని చేసే జెన్సన్ ఆమె కోసం ఉద్యోగం కూడా వదులుకున్నాడు. ఆమె తల్లిదండ్రుల మృతదేహాలను వెతకడంలో, అధికారులను ఆరా తీయడంలో, మృతదేహాలు దొరికిన అనంతరం అంత్యక్రియల్లో శృతికి అనుక్షణం తోడుగా నిలిచాడు. ఈ ప్రాంతాన్ని ప్రధాని పర్యటించినప్పుడు ఇద్దరూ కలిసి మోదీతో మాట్లాడారు. స్థానికంగా ఉన్న టీ ఎస్టేట్ స్థలాన్ని జిల్లా అధికారులు తాత్కాలిక శ్మశానవాటికగా మార్చి 47 మృతదేహాలను, 209 మంది మృతుల అవశేషాలను అందులో ఖననం చేశారు. ఈ క్రమంలో శృతి, జెన్సన్ జంట శ్మశానవాటికకు వచ్చి కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా తామిద్దరం సెప్టెంబర్ నెలలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామని.. ఒకరికొకరం జీవితాంతం తోడుగా ఉంటామని సమాధుల మధ్య ప్రమాణం చేశారు.

Show comments