iDreamPost
android-app
ios-app

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. ఒక్క సంతకం దూరంలో

  • Published Sep 22, 2023 | 9:12 AM Updated Updated Sep 22, 2023 | 9:12 AM
  • Published Sep 22, 2023 | 9:12 AMUpdated Sep 22, 2023 | 9:12 AM
మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. ఒక్క సంతకం దూరంలో

ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న చారిత్రక ఘట్టం చట్టంగా మారడానికి కేవలం సంతకం దూరంలో ఉంది. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేలా.. వారికి 33 శాతం సీట్లు కేటాయించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఇప్పటికే లోక్‌ సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ బిల్లుకి పెద్దల సభ.. రాజ్యసభ కూడా అంగీకారం తెలిపింది. గురువారం రాజ్యసభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఓటింగ్‌ జరపగా.. సభలో ఉన్న సభ్యులందరూ ఏకగ్రీవంగా బిల్లుకు మద్దతు తెలపడంతో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందింది. ముందుగా బిల్లు మీద సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత ఓటింగ్‌ నిర్వహించారు.

కేం‍ద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌.. నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ పేరుతో ఈ చరిత్రాత్మక బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లు మీద సుదీర్ఘంగా చర్చ జరిపారు. చివరికి ఓటింగ్ నిర్వహించగా.. సభలోని సభ్యులు అందరూ మద్దతుగా ఓటు వేశారు. ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో నిర్వహించిన ఈ ఓటింగ్‌ ప్రక్రియలో ఈ బిల్లుకు అనుకూలంగా సభలో ఉన్న 215 మంది తమ మద్దతు తెలిపారు

ఇప్పటికే మంగళవారం మహిళా రిజర్వేషన్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టగా.. బుధవారం దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి ఓటింగ్ నిర్వహించారు. అనంతరంలో సభలో ఉన్న 456 మంది సభ్యుల్లో 454 మంది ఎంపీలు ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపగా.. కేవలం ఇద్దరు ఎంఐఎం ఎంపీలు మాత్రమే వ్యతిరేకిస్తూ ఓటు వేసిన సంగతి తెలిసిందే.

ఇక పార్లమెంటు ఉభయ సభలు ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేయగా.. ఇక చివరి ఘట్టం మాత్రమే మిగిలి ఉంది. ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ వద్దకు పంపించనున్నారు. రాష్ట్రపతి సంతకంతో ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు కాస్త మహిళా రిజర్వేషన్ల చట్టంగా మారనుంది. పార్లమెంటు ఉభయసభల్లోనూ ఈ చరిత్రాత్మక బిల్లుకు ఆమోదం తెలపడంతో.. 1996 లో అప్పటి ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు.. దాదాపు 3 దశాబ్దాల తర్వాత చట్టంగా మారడానికి మార్గం సుగమం అయినట్లు అయ్యింది. అయితే దేశంలోని నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఈ మహిళా రిజర్వేషన్లు అమలు కానున్నాయి.