iDreamPost
android-app
ios-app

భగత్ సింగ్ ఉరి విషయంలో గాంధీ చేసింది తప్పా? ఆయన్ను సిక్కులు ఎప్పటికీ క్షమించరా?

  • Author singhj Published - 05:18 PM, Thu - 23 November 23

స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ ఉరి విషయంలో జాతిపిత మహాత్మా గాంధీ వ్యవహరించిన తీరుపై ఇప్పటికీ అనేక విమర్శలు వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అసలు భగత్ ఉరి విషయంలో గాంధీ చేసింది తప్పా? ఒప్పా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ ఉరి విషయంలో జాతిపిత మహాత్మా గాంధీ వ్యవహరించిన తీరుపై ఇప్పటికీ అనేక విమర్శలు వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అసలు భగత్ ఉరి విషయంలో గాంధీ చేసింది తప్పా? ఒప్పా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author singhj Published - 05:18 PM, Thu - 23 November 23
భగత్ సింగ్ ఉరి విషయంలో గాంధీ చేసింది తప్పా? ఆయన్ను సిక్కులు ఎప్పటికీ క్షమించరా?

భగత్ సింగ్.. ఈ పేరు వింటే చాలు దేశంలోని కోట్లాది మంది ప్రజల గుండెలు గర్వంతో ఉప్పొంగుతాయి. వాళ్ల నరాల్లో నెత్తురు ఉడుకుతుంది. ఇది మామూలు పేరు కాదు.. విప్లవానికి సంకేతం లాంటిది. ఆంగ్లేయుల దాస్య శృంఖలాల నుంచి భరతమాతను విడిపించడానికి త్యాగం చేసిన అమరవీరుడిది. అతనో జ్వలించే నిప్పుకణిక. స్వాతంత్ర్యం కోసం 23 ఏళ్ల వయసులోనే ప్రాణాన్ని అర్పించిన సిసలైన దేశ భక్తుడు. రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యానికి నిద్రలేకుండా చేసిన వీరుడే భగత్ సింగ్. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో మంది సమరయోధుల పాత్ర ఉంది. అయితే స్వరాజ్యం సాధించాలంటే శాంతియుతంగా పోరాడితే కుదరదని.. బ్రిటీషర్ల అణచివేతపై ఎదురు తిరగాల్సిందేనని నమ్మిన అతివాదుల్లో భగత్ సింగ్ ఒకరు.

చెట్లకు తుపాకులు కాస్తాయ్

1907లో పాకిస్థాన్ పంజాబ్​, ల్యాల్​పుర్ (ప్రస్తుత ఫైసలాబాద్) జిల్లా, బంగా సమీపంలోని ఖత్కర్ కలాన్ గ్రామంలో భగత్ సింగ్ జన్మించారు. ఆయన తల్లిదండ్రుల పేర్లు సర్దార్ కిషన్ సింగ్, విద్యావతి. భగత్ పదానికి ‘భక్తుడు’ అనే అర్థం వస్తుంది. ఆయనకు ముందు ‘భగన్​లాల్’ అనే పేరు పెట్టారు’. ఆ తర్వాత భగత్ సింగ్​గా మార్చారు. ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలంటే.. చిన్నతనంలోని ఓ ఘటన గురించి చెప్పుకోవాలి. మూడేళ్ల వయసున్న భగత్ పొలంలో దిగి ఆడుకుంటూ చిన్న చిన్న గడ్డిపరకలను నాటడం మొదలుపెట్టారు. దీన్ని చూసిన ఆయన తండ్రి ‘ఏం చేస్తున్నావ్ నాన్నా’ అని అడిగారు. దీనికి జవాబుగా.. ‘తుపాకులు నాటుతున్నా. చెట్లు పెరిగి, తుపాకులు కాస్తాయి’ అని అన్నారు. మొలకలు వేసి గన్స్​ను మొలకెత్తించాలని చూడటం ఆయన పర్సనాలిటీకి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు.

రివేంజ్ తీర్చుకుంటా

ఆంగ్లేయులతో పోరాడుతూ భగత్ సింగ్ బాబాయ్ సర్దార్ అజిత్ సింగ్ చనిపోయారు. ఆ టైమ్​లో కన్నీళ్లు పెడుతున్న చిన్నమ్మను చూసి నాలుగేళ్ల భగత్ ‘ఏడ్వొద్దు పిన్నీ.. బ్రిటీషర్లపై నేను ప్రతీకారం తీర్చుకుంటా’ అని ప్రతిజ్ఞ చేశారు. ఆయన వ్యక్తిత్వానికి ఇది మరో మచ్చుతునక. స్వామి దయానంద సరస్వతి ప్రభావం భగత్​పై బాగా ఉండేది. మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమం కూడా ఆయనపై విపరీతంగా ఎఫెక్ట్ చూపింది. ఆ ఉద్యమంలో స్వయంగా పాల్గొన్న భగత్ సింగ్.. అహింసా ఉద్యమం వల్లే కాకుండా హింసాత్మక ఉద్యమంతోనూ ఆంగ్లేయుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలనే ఆలోచనలో ఉండేవారు. 1919లో చోటుచేసుకున్న జలియన్ వాలాబాగ్ దురాగతం ఆయనలో బ్రిటీషర్ల మీద కోపాన్ని మరింత రెట్టింపు చేసింది.

అదొక్కటే కోరిక

చిన్నప్పటి నుంచి చదువులో భగత్ సింగ్ ఎంతో ముందుండేవారు. 1923లో లాహోర్​లోని నేషనల్ కాలేజీలో ఆయన చేరారు. ఉర్దూ, హిందీ, పంజాబీతో పాటు గురుముఖీ, ఇంగ్లీష్, సంస్కృతం భాషల్లో ఆయనకు మంచి పట్టుండేది. యుక్త వయసు రాగానే భగత్ సింగ్​కు పెళ్లి చేసేందుకు ఆయన ఫ్యామిలీ ప్రయత్నించింది. కానీ దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేయాలనుకుంటున్నానని.. మరే ఇతర కోరిక తనకు లేదని లెటర్ రాసి ఇంట్లో నుంచి పారిపోయారు భగత్ సింగ్. అలా ఇంటి నుంచి బయల్దేరి కాన్పూర్​కు చేరుకున్నారు. అక్కడ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు గణేశ్ శంకర్ విద్యార్థిని ఆయన కలుసుకున్నారు. గణేశ్ శంకర్ నడిపే ‘ప్రతాప్’ పత్రికలో పనిచేయడం మొదలుపెట్టారు భగత్. బల్వంత్ పేరుతో ఆయన వ్యాసాలు రాసేశారు. ఈ క్రమంలో ఫ్రీడమ్ ఫైటర్స్ బటుకేశ్వర్ దత్తా, శివ వర్మ, బీకే సిన్హా లాంటి వారితో ఆయనకు పరిచయం ఏర్పడింది.

లాలాజీ మరణం

1924లో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్​లో చేరారు భగత్ సింగ్. మంచి వక్త అయిన ఆయన తక్కువ టైమ్​లోనే సంఘానికి నాయకుడైన చంద్రశేఖర్ ఆజాద్​కు దగ్గరయ్యారు. 1927లో కాకోరీ ఘటనకు సంబంధించి తొలిసారి జైలుకు వెళ్లారు భగత్. అదే సంవత్సరం సైమన్ కమిషన్ ఇండియాకు వచ్చింది. దీన్ని లాలా లజపతి రాయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే నిరసనల సందర్భంగా లాఠీ ఛార్జ్ చేయాలని ఎస్పీ జేఏ స్కాట్ ఆదేశించారు. లజపతి రాయ్​ను లాఠీతో కొట్టాడు స్కాట్. రక్తపు మడుగులో ఉన్న రాయ్ స్పృహ కోల్పోయేంత వరకు కొడుతూనే ఉన్నాడు. ‘మా మీద పడే ప్రతి లాఠీ దెబ్బ బ్రిటీష్ సామ్రాజ్యపు సమాధిపై మేకుగా మారుతుంది’ అని స్పృహ కోల్పోయే ముందు గట్టిగా అరిచారు లాలా లజపతి రాయ్. ఆ తర్వాత సెప్టెంబర్ 17న ఆయన కన్నుమూశారు. లజపతి రాయ్ మరణానికి బదులు తీర్చుకోవాలని భగత్ సింగ్ ఫిక్స్ అయ్యారు.

దాడికి ప్లాన్ ఫిక్స్

1928 డిసెంబర్ 10వ తేదీన దేశంలోని ఉద్యమకారులంతా లాహోర్​లో సమావేశం అయ్యారు. ఈ మీటింగ్​కు భగవతీ చరణ్ వోహ్రా భార్య దుర్గాదేవి నాయకత్వం వహించారు. రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. లాలాజీ మృతిని చూస్తూ భారత్ మౌనంగా ఉండదని ప్రపంచానికి చాటి చెప్పాలని భగత్ సింగ్ దృఢంగా నిశ్చయించుకున్నారు. మీటింగ్​లో అనుకున్నట్లుగానే ఎస్పీ స్కాట్​ను చంపేందుకు భగత్ సింగ్, సుఖ్​దేవ్, చంద్రశేఖర్ ఆజాద్, జైగోపాల్​ రంగంలోకి దిగారు. స్కాట్​ను లేపేసేందుకు పక్కా ప్లాన్ కూడా వేశారు. అయితే స్కాట్​కు బదులు అనుకోకుండా ఎస్పీ జేపీ సాండర్స్​ను చంపేశారు. ఆ తర్వాత పోలీసులకు దొరకకుండా తప్పించుకొని ఆగ్రాకు వెళ్లారు. అయితే సాండర్స్ హత్య తర్వాత భయపడి బ్రిటీషర్లు భారత్​ నుంచి వెళ్లిపోతారని అనుకున్నారు. కానీ అలా జరగకపోవడంతో ఈసారి సెంట్రల్ అసెంబ్లీ (ఇప్పటి పార్లమెంటు ఉన్న చోటు)పై దాడి చేయాలని డిసైడ్ అయ్యారు.

ఉరిని ముద్దాడిన భగత్

బటుకేశ్వర్ దత్​తో కలసి సెంట్రల్ అసెంబ్లీలోకి ప్రవేశించిన భగత్ సింగ్.. అక్కడ ఎవరూ లేని ప్రాంతంలో ఒక బాంబు వేశారు. ఆ బాంబు పేలగానే హాల్ మొత్తం చీకటి కమ్ముకుంది. బటుకేశ్వర్ రెండో బాంబ్ వేయగానే ప్రేక్షకుల గ్యాలరీలో నుంచి అసెంబ్లీలోకి కరపత్రాలు ఎగురుతూ వచ్చి పడ్డాయి. ఇంక్విలాబ్ జిందాబాద్, శ్రామిక వర్గం వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు భగత్, బటుకేశ్వర్. పారిపోయే ఛాన్స్ ఉన్నప్పటికీ వాళ్లిద్దరూ పోలీసులకు పట్టుబడాలని నిర్ణయించుకున్నారు. ఈ కేసులో వాళ్లకు జీవిత ఖైదు విధించారు. అయితే సాండర్స్ హత్య కేసులో భగత్​తో పాటు రాజ్​గురూ, సుఖ్​దేవ్​లకు ఉరిశిక్ష వేశారు. శిక్ష అమలు టైమ్​లో ఉరి తాడును ముద్దాడారు భగత్ సింగ్. ఆ తర్వాత ఆ ముగ్గురు సమరయోధులు అమరులయ్యారు. అయితే ఈ ఉరిశిక్ష అమలు విషయంలో మహాత్మా గాంధీ వ్యవహరించిన తీరుపై సిక్కులు అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం.

భగత్ అంటే గాంధీకి గిట్టదా?

భగత్ సింగ్, సుఖ్​దేవ్, రాజ్​గురులను ఉరితీయడం అత్యంత పాశవిక చర్య అని అప్పట్లో న్యూయార్క్​లోని డెయిలీ వర్కర్ పత్రిక వ్యాఖ్యానించింది. అయితే ఆ రోజుల్లో గాంధీ కరాచీ పర్యటనలో ఉన్నారు. ఈ ఉరితీతలకు పరోక్షంగా ఆయనే కారణమంటూ ఆరోపణలు వచ్చాయి. కరాచీ రైల్వే స్టేషన్​కు గాంధీ ప్రయాణిస్తున్న రైలు రాగానే పెద్ద మొత్తంలో సిక్కులతో పాటు ఇతర నిరసనకారులు చేతుల్లో నల్ల రంగు పూలు పట్టుకొని నిరసన తెలిపారు. ఇండియా ఫ్యూచర్ కోసం లార్డ్ ఇర్విన్​తో జరిపిచ చర్చల్లో భగత్ సింగ్ ఉరిని ఆపేయాలనే నిబంధనను గాంధీ జోడించలేదంటూ ఆరోపణలు వినిపించాయి. భగత్ దూకుడు ప్రవర్తన మహాత్ముడికి నచ్చేది కాదని.. ఆయన బిహేవియర్​ను గాంధీ వ్యతిరేకించే వారంటూ అనేక కథలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి.

ఆ వ్యాసంలో ఏముంది?

భగత్ సింగ్ బలిదానం తర్వాత గాంధీ ఒక వ్యాసం రాశారని చెబుతారు. అందులో భగత్​పై తన అభిప్రాయాలను ఆయన వెల్లడించారు. ‘లాహోర్​లో అతడు స్టూడెంట్​గా ఉన్నప్పుడు నేను చాలాసార్లు చూశా. కానీ అతని రూపం నాకు గుర్తులేదు. భగత్ దేశభక్తి, ధైర్యం, భారతీయ సమాజం మీద ఆయనకు ఉన్న ప్రేమ గురించి నేను కథలు, కథలుగా విన్నా. అలాంటి యువకుడికి ఉరిశిక్ష వేయడమంటే వారి తలలపై అమరవీరుల కిరీటాన్ని ఉంచడమే. లక్షలాది మంది ప్రజలు భగత్ సింగ్​ మరణాన్ని తమ సొంత బంధువు లేని లోటుగా భావిస్తున్నారు. అయితే హత్యల ద్వారా దేశాన్ని రక్షించాలనుకోకూడదు. భగత్ విప్లవకారుల హృదయాలను గెలుచుకున్నాడు’ అని ఆ వ్యాసంలో రాసుకొచ్చారు గాంధీ.

భగత్ సింగ్​ను ఉరితీసే రోజున కూడా ఆయనకు వేసిన శిక్షను తగ్గించాల్సిందిగా బ్రిటిషర్లను గాంధీ కోరారని ఆయన మద్దతుదారులు అంటారు. అప్పటికే ఈ విషయంపై ఆంగ్లేయుల ప్రభుత్వానికి ఆయన పలుమార్లు విజ్ఞప్తి చేశారని చెబుతారు. అయితే సత్యాగ్రహ ఉద్యమం సమయంలో అరెస్ట్ అయిన వేలాది మంది రాజకీయ ఖైదీలను గాంధీ-ఇర్విన్ ఒప్పందం ద్వారా విడిపించిన మహాత్ముడు.. భగత్ సింగ్, రాజ్​గురు, సుఖ్​దేవ్​లను మాత్రం బయటకు తీసుకురాలేకపోయారని సిక్కు సమాజానికి చెందిన చాలా మంది విమర్శిస్తుంటారు. కనీసం భగత్​కు శిక్షను కూడా తగ్గించలేకపోయారని.. గాంధీ చేసిన తప్పుకు ఆయన్ను ఎప్పటికీ క్షమించలేమని అంటుంటారు.

భగత్ సింగ్ ఉరి విషయంలో గాంధీ వ్యవహరించిన తీరు తప్పంటూ ‘ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్’ లాంటి పలు పాపులర్ హిందీ సినిమాల్లో చూపించడం గమనార్హం. ఈ మూవీతో పాటు ‘రంగ్ దే బసంతి’ ఫిల్మ్ రిలీజ్ తర్వాత భగత్ ఉరి విషయంలో గాంధీదే తప్పు అనే ప్రత్యేక వాదం ప్రజల్లో బాగా వ్యాపించింది. వాళ్లను ఉరితీసేందుకు బ్రిటీషు సర్కారుతో కలసి గాంధీ కుట్రపన్నాడనే మరో భిన్న వాదం కూడా వినిపించింది. అయితే ఇవన్నీ తప్పని.. భగత్​ను ఉరి నుంచి తప్పించడానికి గానీ శిక్షను తగ్గించడానికి గానీ విన్నపం చేసేంత సాన్నిహిత్యం బ్రిటీషు ప్రభుత్వంతో గాంధీకి లేదనేది ఆయన్ను సపోర్ట్ చేసేవారి వాదన. ఇందులో నిజానిజాల నిగ్గు తేలనంత వరకు రకరకాల కథనాలు, వాదనలు వినిపించడం మాత్రం ఆగవనే చెప్పాలి. అయితే ఆ రోజు ఆ ముగ్గురి వీరమరణం వృథా పోలేదు. తాము అనుకున్నట్లుగానే బలిదానంతో ఎందరో యువకులను స్వాతంత్ర్యోద్యమం వైపు మలచడంలో భగత్ సింగ్ ఆయన అనుచరులు సక్సెస్ అయ్యారు. మరి.. భగత్ సింగ్ ఉరి విషయంలో గాంధీజీ వ్యవహరించిన తీరుపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.