nagidream
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కాబోయే కోడలు రాధికా మర్చంట్ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కాబోయే కోడలు రాధికా మర్చంట్ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
nagidream
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు పలు ప్రముఖ సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈ ఏడాది 12న ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అంబానీ కుటుంబం ఇచ్చిన ఆతిధ్యం, వారు పాటించిన పద్ధతులు, విధానాలు యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ వేడుకలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల జంట ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే రాధికా మర్చంట్ ఎవరు అని తెగ సెర్చింగ్ చేస్తున్నారు నెటిజన్స్. మరి రాధికా మర్చంట్ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే వివరాలు మీ కోసం.
రాధికా మర్చంట్ (29) గత ఏడాది జనవరి నెలలో అనంత్ అంబానీతో నిశ్చితార్థం జరిగింది. ఈమె ఎన్కోర్ హెల్త్ కేర్ వ్యవస్థాపకులు అయినటువంటి వీరెన్ మర్చంట్, శైల మర్చంట్ ల చిన్న కుమార్తె. ఈమె 1994లో డిసెంబర్ 18న జన్మించారు. రాధికా తండ్రి వీరెన్ మర్చంట్ ఎన్కోర్ హెల్త్ కేర్ కంపెనీకి సీఈఓగా ఉన్నారు. అలానే స్టీల్ తయారీ కంపెనీ అయిన ‘ఏపీఎల్ అపోలో ట్యూబ్స్’కి బోర్డు మెంబర్ గా కూడా ఉన్నారు. ఇక ఎన్కోర్ హెల్త్ కేర్ కంపెనీకి రాధికా తల్లి శైల మర్చంట్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు. రాధికా అక్క అంజలి మర్చంట్ ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఆకాష్ మెహతాను వివాహం చేసుకున్నారు.
ఇక రాధికా మర్చంట్ కేథడ్రాల్, జాన్ కణ్ణన్, ఏకోలే మొండాయిల్ వరల్డ్ స్కూల్లో చదువుకున్నారు. బీడీ సోమయాని ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఇంటర్నేషనల్ బాకలారియేట్ డిప్లొమా చేశారు. న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ లో గ్రాడ్యుయేట్ అయ్యారు. చదువు పూర్తి చేసుకుని భారతదేశం వచ్చిన తర్వాత ఇస్ప్రవ అనే లగ్జరీ రియల్ ఎస్టేట్ కంపెనీలో జాయిన్ అయ్యారు. అక్కడ ఏడాది పాటు పని చేసిన తర్వాత ఎన్కోర్ హెల్త్ కేర్ లో చేరారు. ఈమె భరతనాట్యంలో శిక్షణ కూడా తీసుకున్నారు. 2022లో జూన్ నెలలో ముంబై జియో వరల్డ్ సెంటర్ లో ఈమె తన మొదటి నృత్య ప్రదర్శన చేశారు.
జంతు సంరక్షణ, పౌర హక్కులు, మానవ హక్కులు, ఆర్థిక సాధికారత, విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ వంటి విషయాలపై ఈమెకు ఆసక్తి ఎక్కువ. ఇక రాధికా మర్చంట్, అనంత్ అంబానీ ఇద్దరూ బాల్య స్నేహితులు. ఈ కారణంగా రాధికా తరచూ అంబానీ ఇంటికి వెళ్లేవారని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఈమె 2018లో జరిగిన ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ వివాహ వేడుకకు.. అలానే 2019లో జరిగిన ఆకాష్ అంబానీ, శ్లోకల వివాహ వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం తండ్రి వీరెన్ మర్చంట్ కి చెందిన ఎన్కోర్ హెల్త్ కేర్ కంపెనీలో పని చేస్తున్నారు. ఈమె ఎన్కోర్ హెల్త్ కేర్ కంపెనీకి బోర్డు డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్నారు.