iDreamPost
android-app
ios-app

చిన్నారి చొరవతో తప్పిన పెను ప్రమాదం.. వందల మంది ప్రాణాలు కాపాడాడు

  • Published Sep 24, 2023 | 2:32 PMUpdated Sep 24, 2023 | 2:32 PM
  • Published Sep 24, 2023 | 2:32 PMUpdated Sep 24, 2023 | 2:32 PM
చిన్నారి చొరవతో తప్పిన పెను ప్రమాదం.. వందల మంది ప్రాణాలు కాపాడాడు

ఎదురుగా పెను ప్రమాదం.. ఏమాత్రం ఆలస్యం చేసినా.. వందల మంది ప్రాణాలు గాల్లో కలుస్తాయి.. తను చూస్తేనేమో.. పట్టుమని 10 ఏళ్ల బాలుడు. అయినా సరే.. తన ఎదురుగా ఉన్న వారి ప్రాణాలు కాపాడాలని భావించాడు. సమయస్ఫూర్తితో వ్యవరించడంతో.. పెను ప్రమాదం తప్పింది. బాలుడు చూపిన చొరవపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఇంతకు ఏం జరిగింది.. పదేళ్ల బాలుడు వందల మంది ప్రాణాలు ఎలా కాపాడాడు అంటే..

ఈ సంఘటన పశ్చిమబెంగాల్‌, మాల్దా జిల్లా హరిశ్చంద్రపుర్‌ రెండో బ్లాక్‌లోని మషాల్దాహ్ పంచాయతీ పరిధి కరియాలి గ్రామం వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముర్సెలీమ్‌ అనే పదేళ్ల బాలుడు శుక్రవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో చెరువుకి సమీపంలో ఉన్న రైలు పట్టాల కింద పెద్ద గుంత ఏర్పడి ఉండటం గమనించాడు ముర్సెలీమ్‌. సరిగా అదే సమయంలో.. ఆ పట్టాల మీదుగా అగర్తల-సియాల్దా కాంచన్‌జుంగా ఎక్స్‌ప్రెస్‌ రైలు వేగంగా దూసుకు వస్తుంది.

ఒక్క నిమిషం తన ఎదురుగా జరగబోయే పెను ప్రమాదం కళ్ల ముందు కనబడింది. దాంతో వెంటనే ఎలాగైనా రైలును ఆపాలని భావించాడు. అదృష్టం కొద్ది ఆ రోజు ముర్సెలీమ్‌.. ఎరుపు రంగు టీషర్ట్‌ ధరించి ఉన్నాడు. వెంటనే దాన్ని తీసి రైలుకు ఎదురుగా గాల్లో ఊపుతూ నిలబడ్డాడు. ముర్సెలీమ్‌ను గమనించిన లోకోపైలట్‌ ప్రమాదం ఉందని గ్రహించి వెంటనే రైలును నిలిపివేశాడు.

కిందకు దిగిన లోకోపైలట్‌‌కు ముర్సెలీమ్ పట్టాల పరిస్థితి.. గుంత ఏర్పడిన విషయం వివరించాడు. దాంతో బాలుడి సమయస్ఫూర్తికి ఆయన ఆశ్చర్యపోయారు. చిన్నారిని అభినందించిన లోకోపైలట్.. వెంటనే రైల్వే సిబ్బందికి దీని గురించి సమాచారం ఇవ్వండతో వారు ఘటనా స్థలానికి చేరుకుని గుంతను పూడ్చివేశారు. ఈ సంఘటన నేపథ్యంలో సుమారు గంట పాటు రైలును అక్కడ నిలిపివేయాల్సి వచ్చింది. పనులు పూర్తయిన తర్వాత రైలు యథావిథిగా బయలుదేరింది. ముర్సెలీమ్‌ పేరును అవార్డు కోసం సిఫార్సు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. ముర్సెలిమ్‌ చేసిన పని చూసి అతడి తల్లిదండ్రులు గర్వ పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి