Venkateswarlu
Venkateswarlu
వీరప్పన్.. ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి లేదు. 1970నుంచి 2000 మధ్య కాలంలో ఆయన దక్షిణ భారత దేశంలోని అడవుల్లో ఎన్నో నేరాలకు పాల్పడ్డారు. దంతాల కోసం ఏనుగుల వేట.. చందనం అక్రమ రవాణా వంటి వాటిలో దేశ వ్యాప్తంగా ఆయన పేరు మారుమోగింది. దాదాపు 180కి పైగా మనుషుల్ని.. 2 వేలనుంచి మూడు వేలకు పైగా ఏనుగుల్ని ఆయన చంపినట్లు తెలుస్తోంది. అంతేకాదు! సినీ, రాజకీయ ప్రముఖుల్ని సైతం కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇన్ని దారుణాలకు పాల్పడిన ఆయన 2004లో ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు.
ఇక, అప్పటినుంచి వీరప్పన్ జీవిత చరిత్రపై సినిమాలు, డాక్యుమెంటరీ ఫిల్మ్‌లు వస్తూనే ఉన్నాయి. తాజాగా, నెట్‌ఫ్లిక్స్ కూడా ‘హంట్ ఫర్ వీరప్పన్’ పేరిట ఓ సిరీస్‌ను తీసింది. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌పై వీరప్పన్ కూతురు విద్య స్పందించారు. విద్య మాట్లాడుతూ.. ‘‘ నేను ఆ ట్రైలర్ పూర్తిగా చూడలేదు. ఆ డాక్యుమెంటరీ గురించి నాకు పూర్తిగా తెలీదు. మా నాన్న గురించి చెప్పటానికి వారు ‘ మనిషి రూపంలో ఉన్న మృగం’ అని అన్నారు. మా అమ్మ నెట్‌ఫ్లిక్స్ వాళ్లతో మాట్లాడింది. ఆ సిరీస్ వన్‌సైడ్‌గా ఉండదని వారు హమీ ఇచ్చారు.
వీరప్పన్ ఇలా కావటానికి కారణాలేంటనే దాన్ని తెలుసుకోవటానికి జనం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అడవి చుట్టూ ఉండేవారు.. వారి పూర్వీకులు చేసిన పనినే చేస్తూ ఉంటారు. వాళ్లు విలాసవంతమైన జీవితం కోసం అలా చేయరు. మా నాన్న 2 వేల ఏనుగుల్ని.. వందల మందిని చంపాడని అంటున్నారు. కానీ, అందుకు సరైన ఆధారాలు లేవు. మరి, పోలీసులు చేసిన ఘోరాల గురించి ఏమనాలి. పోలీసులు ప్రజల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. మా నాన్న కట్టించిన గుడిని కూడా కూల్చేశారు. మా నాన్న మాత్రమే కాదు.. చాలా మంది స్మగ్లింగ్ చేసేవారు.
మరి, ఎందుకు మా నాన్ననే టార్గెట్ చేశారు. మరి, మా నాన్న దగ్గరినుంచి ఏనుగు దంతాలు, చందనం తీసుకున్న వారి సంగతి ఏంటి? వారి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? నాన్న ప్రజల గురించి మాట్లాడారు. అటవీ అధికారుల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడారు. మా నాన్న నేరాలకు పాల్పడ్డారు. అది నేను ఒప్పుకుంటాను. కానీ, ఒకానొక సమయంలో ఆయన రియలైజ్ అయ్యారు. సమాజం గురించి ఓ అవగాహనకు వచ్చారు. ప్రపంచం మొత్తం తనను బాగా అర్థం చేసుకోవాలని కోరుకున్నారు’’ అని అన్నారు. మరి, వీరప్పన్ కూతురు చెప్పిన ఈ సంచలన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.