నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని తాకడంతో.. సామాన్యుల జేబుకు చిల్లు పడుతోంది. ఇప్పటికే కూరగాయల ధరలతో పాటుగా గ్యాస్ సిలిండర్ ధరలు కూడా మండుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ధరల భారం నుంచి సామాన్యులకు ఊరట కలిగించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే వంట గ్యాస్ సిలిండర్ ధరల తగ్గింపుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. త్వరలోనే గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్రం త్వరలోనే శుభవార్త చెప్పబోతోంది. ఈ మేరకు సామాన్యులకు ఊరట కలిగించేందుకు గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ..”కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో మూడు గ్యాస్ సిలిండర్ లను ఉచితంగా అందించింది. అదీకాక ఇప్పటికే గ్యాస్ సిలిండర్ పై రూ.200 సబ్సిడీ అందిస్తోంది. ప్రస్తుతం గ్యాస్ వినియోగం పెరిగింది. ఇక బలహీన వర్గాలకు ఊరట కలిగించేందుకు త్వరలోనే గ్యాస్ సిలిండర్ల ధరల తగ్గింపును చేపడతాం” అని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు.
ఇక గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయిల్ బాండ్లతో ఇప్పటికే ప్రభుత్వంపై భారం పడుతోందని మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1200 వరకు ఉంది. కాగా.. ఈ ఏడాది చివర్లో 4 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ఈ కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదీకాక వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి.. సామాన్యుల అభిమానాన్ని చురగొనాలని కేంద్రం భావిస్తోంది.
ఇదికూడా చదవండి: బైక్ ఢీ కొనడంతో అగ్నిప్రమాదం.. బస్సు దగ్ధం