P Venkatesh
P Venkatesh
ఇల్లూ, భార్యా పిల్లలను వదిలి నిరంతరం దేశ రక్షణ కోసం పాటుపడుతున్న సైనికులకు ప్రతి క్షణం మృత్యువుతో పోరాటమే. ఎప్పుడు ఏ మూల నుంచి శత్రువులు దాడికి దిగుతారో తెలియని పరిస్థితి. అయినప్పటికి నిరంతరం అప్రమత్తతతో ఉంటూ దేశ సంపదను, పౌరుల ప్రాణాలను కాపాడుతూ సేవలను అందిస్తున్నారు దేశ సైనికులు. కాగా అనంత్ నాగ్ లో ఉగ్రవాదులను నిలువరించే క్రమంలో ఓ ఆర్మీ ఆఫీసర్ అమరుడయ్యారు. ఆయన అంత్యక్రియల్లో గుండెలను పిండేసే దృశ్యాలు ప్రతిఒక్కరిని కలిచివేస్తున్నాయి. అసలు ఏం జరిగిందో తెలియని ఆ పసి హృదయాలు అమరుడైన తన తండ్రికి వీడ్కోలు పలికిన తీరు కంటనీరు తెప్పిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జమ్మూ కశ్మీర్ లోని అనంత్ నాగ్ అడవుల్లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుపెట్టారు. ఈ కాల్పుల్లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోనక్, డీఎస్పీ హుమాయూన్ భట్ సహా మరో సైనికుడు అమరులయ్యారు. కాగా కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ భౌతికకాయాన్ని శుక్రవారం ఆయన స్వస్థలం ముల్లాన్‌పుర్‌కు తీసుకువచ్చారు ఆర్మీ అధికారులు. భౌతిక కాయాన్ని చూసిన కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. అమరుడైన కల్నల్ మన్ ప్రీత్ సింగ్ కు నివాళులర్పించేందుకు పెద్ద సంఖ్యలో జనాలు అక్కడికి చేరుకున్నారు. ఇక అమరుడైన తన తండ్రికి ఆ చిన్నారులు నివాళులర్పించిన తీరు హృదయాలను మెలిపెడుతున్నాయి.
కల్నల్ సింగ్ కుమారుడు ఆర్మీ దుస్తులు ధరించి జైహింద్ నాన్నా అంటూ.. సెల్యూట్ చేస్తూ వీడ్కోలు పలికాడు. అసలు ఏం జరిగిందో కూడా తెలియని అమాయకపు స్థితిలో పిల్లలు తండ్రికి వీడ్కోలు పలుకుతుంటే అందరు కన్నీరు మున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు బరువెక్కిన హృదయాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఇక ఈ ఘటనతో రగిలిపోతుతున్న భారత సైన్యం అనంత్ నాగ్ లో తలదాచుకున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారీగా బలగాలను తరలించింది.
#WATCH | Son of Col. Manpreet Singh salutes before the mortal remains of his father who laid down his life in the service of the nation during an anti-terror operation in J&K’s Anantnag on 13th September
The last rites of Col. Manpreet Singh will take place in Mullanpur… pic.twitter.com/LpPOJCggI2
— ANI (@ANI) September 15, 2023