Dharani
Saudi Jail: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళీయులు ఓ వ్యక్తి కోసం ఏకంగా 34 కోట్ల రూపాయలు విరాళాలు సేకరించారు. ఎందుకంటే..
Saudi Jail: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళీయులు ఓ వ్యక్తి కోసం ఏకంగా 34 కోట్ల రూపాయలు విరాళాలు సేకరించారు. ఎందుకంటే..
Dharani
మన దేశం నుంచి ఉపాధి కోసం ప్రతి ఏటా ఎందరో గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. ఇక కేరళ నుంచి వెళ్లే వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. గల్ఫ్ దేశాల్లో మంచి ఆదాయం లభించడంతో పాటు.. చిన్న తప్పు చేసినా.. భారీ శిక్షలు విధిస్తారు. మనకు చాలా చిన్నగా అనిపించే తప్పులకే ఆ దేశాల్లో ఉరిశిక్ష విధిస్తారు. ఈ క్రమంలో సౌదీ జైలులో ఉన్న ఓ ఖైదీని విడిపించేందుకు కేరళీయులు ముందుకు వచ్చారు. విరాళాల రూపంలో ఏకంగా 34 కోట్ల రూపాయలు సేకరించారు. ఆ వివరాలు..
సౌదీ అరేబియాలో మరణశిక్ష ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళీయులు ఏకం అయ్యారు. అతడిని విడిపించేందుకు అవసరమైన రూ.34 కోట్లు సమీకరించడం విశేషం. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ సౌదీలో ప్రత్యేక అవసరాల బాలుడికి కేర్ టేకర్‌గా ఉండేవాడు. అయితే, 2006లో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఆ బాలుడు రహీమ్ సంరక్షణలో ఉండగానే చనిపోయాడు. దాంతో సౌదీ అధికారులు రహీమ్ ను అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అక్కడి న్యాయస్థానం అతడికి మరణశిక్ష విధించింది.
దాదాపు 18 ఏళ్లుగా రహీమ్ సౌదీ జైల్లో మగ్గుతున్నాడు. అయితే చనిపోయిన బాలుడి కుటుంబం క్షమాభిక్షకు అంగీకరించకపోవడంతో న్యాయస్థానం 2018లో అబ్దుల్‌కు మరణశిక్ష విధించింది. నిందితుడి తరఫు అభ్యర్థనలను కోర్టు తిరస్కరించింది. ఇలా ఉండగా..‘బ్లడ్ మనీ’ చెల్లిస్తే రహీమ్ ను క్షమిస్తామని మరణించిన బాలుడి కుటుంబం తెలిపింది. అందుకు గాను ఏకంగా రూ.34 కోట్లు డిమాండ్ చేసింది ఆ ఫ్యామిలీ. ఈ నెల 18లోగా ఆ మొత్తాన్ని చెల్లించినట్లైతే మరణశిక్ష తప్పే అవకాశం ఉంది.
విషయం తెలుసుకున్న కేరళీయులు ఆ మొత్తాన్ని సమీకరించి రహీమ్‌ను విడిపించేందుకు ఓ క్యాంపెయిన్ చేపట్టారు. యాక్షన్ కమిటీ నిధుల సమీకరణ మొదలు పెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను సైతం రూపొందించింది. ఐదు రోజుల కిందటి వరకు కొద్ది మొత్తమే విరాళాలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళీయులు పెద్ద ఎత్తున స్పందించి విరాళాలు అందించి తమ మంచి మనసు చాటుకున్నారు. రహీమ్ ను విడిపించడానికి అవసరమైన 34 కోట్ల రూపాయలు విరాళాల ద్వారా సేకరించినట్లు కమిటీ తెలిపింది.
ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. ‘రహీమ్ కోసం చేపట్టిన నిధుల సమీకరణకు రియాద్‌లో 75 సంస్థలు, కేరళకు చెందిన వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరు సహా పలు రాజకీయ పార్టీలు, సామాన్య పౌరులు విరాళాలు ఇవ్వడం కోసం ముందుకు వచ్చారు. వారందరికి ధన్యవాదాలు‘‘ అని తెలిపారు.