దేశ ప్రధాని నరేంద్ర మోడీని అభిమానించేవారు, అనుసరించేవారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఆయన్ను ఇష్టపడేవారు ఎందరో ఉన్నారు. ఆయనకు యూత్‌లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దేశంలో ఎక్కడికి వెళ్లినా ఆయనకు అపూర్వ ఆదరణ దక్కుతుంది. అత్యున్నత పదవిలో ఉన్న మోడీకి దక్కే గౌరవ, మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ఆయన క్షమాపణ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అవును, ఇది నిజమే. ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు ఆయన ముందస్తు క్షమాపణలు చెప్పారు.
ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పడానికి ఓ కారణం ఉంది. ప్రతిష్టాత్మక జీ20 సదస్సు త్వరలో ఢిల్లీలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ సదస్సును విజయవంతం చేయాలని దేశ రాజధాని ఢిల్లీ ప్రజల్ని మోడీ కోరారు. అయితే ఆ సదస్సు జరిగే టైమ్‌లో పలువురు ప్రపంచ నేతలు ఢిల్లీకి రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ఆయన తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపుల కారణంగా ఢిల్లీ ప్రజలు కొంత ఇబ్బందికి గురికావొచ్చని, అందుకే ముందుగానే క్షమాపణలు చెబుతున్నానని మోడీ పేర్కొన్నారు. బెంగళూరు పర్యటన ముగించుకొని న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని.. విమానాశ్రయం బయట మాట్లాడారు.
జీ20 సమ్మిట్ కోసం జరుగుతున్న ఏర్పాట్ల వల్ల ఢిల్లీ ప్రజలు ఎదుర్కొనే అసౌకర్యానికి దయచేసి తనను క్షమించాలని ప్రధాని మోడీ కోరారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు దేశం మొత్తం ఆతిథ్యం ఇస్తోందని.. అయితే అతిథులు మాత్రం ఢిల్లీకి వస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సమ్మిట్‌ను సక్సెస్ఫుల్ చేయడంలో ఢిల్లీ ప్రజలకు ప్రత్యేక బాధ్యత ఉందన్నారు. ఈ దేశ ప్రతిష్ట మీద ఏమాత్రం ప్రభావం పడకుండా ప్రజలు చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు మోడీ. కాగా, సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో ఢిల్లీలో జీ20 దేశాధినేతల సమ్మిట్ జరగనుంది. దీనికి యూరోపియన్ యూనియన్‌తో ఆహ్వానిత అతిథి దేశాలకు చెందిన 30 మందికి పైగా దేశాధినేతలు, ఉన్నతాధికారులు, 14 మంది అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరయ్యే ఛాన్స్ ఉంది.