iDreamPost
android-app
ios-app

Toll Plazas: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై టోల్ ప్లాజాలు కనిపించవు

  • Published Mar 31, 2024 | 2:50 PM Updated Updated Mar 31, 2024 | 2:50 PM

టోల్ ప్లాజాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

టోల్ ప్లాజాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

  • Published Mar 31, 2024 | 2:50 PMUpdated Mar 31, 2024 | 2:50 PM
Toll Plazas: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై టోల్ ప్లాజాలు కనిపించవు

మాములు సమయాల్లో ఏమో కానీ.. పండగల వేళ టోల్ ప్లాజాల వద్ద ఎంత భారీ క్యూ లైన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కిలోమీటర్ల మేర వాహనాలు టోల్ గేట్స్ వద్ద క్యూ కట్టి ఉంటాయి. అయితే త్వరలోనే ఈ కష్టాలకు చెక్ పడనుంది. ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అసలు టోల్ గేట్స్ అనేవి ఇకపై కనిపంచవు.. అవి చరిత్రలో కలిసిపోనున్నాయి. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల. అసలేం జరిగింది అంటే..

భారతదేశం కొత్త టోల్ వసూలు వ్యవస్థకు మారడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న టోల్ వ్యవస్థ స్థానంలో శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ ను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కొత్త విధానం వల్ల టోల్ వసూలు వేగవంతం అవుతుందని.. ఫలితంగా టోల్ ప్లాజాల వద్ద భారీ క్యూలు ఉండబోవన్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల జాతీయ రహదారులపై ప్రస్తుతం అమల్లో ఉన్న టోల్ ప్లాజాలు త్వరలో చరిత్రలో కలిసిపోనున్నాయి.

No more toll plazas

ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల స్థానంలో సరికొత్త శాటిలైట్ ఆధారిత టోల్ వసూళ్లను ప్రారంభిస్తామని నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ కొత్త టోల్ వసూలు విధానం త్వరలో అమల్లోకి వస్తుందన్నారు. ప్రస్తుతం దీనిని కొన్ని ఎంపిక చేసిన మార్గాలలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.

కొత్త టోల్ వసూలు విధానంలో.. కస్టమర్ బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా డబ్బును కట్ చేస్తారు. టోల్ మొత్తం వాహనం ప్రయాణించిన దూరంపై ఆధారపడి ఉంటుంది. ఈ సమాచారమంతా జీపీఎస్ ద్వారా సేకరిస్తారు. ప్రస్తుత విధానంలో వాహనం ప్రయాణించే దూరంతో సంబంధం లేకుండా ప్రతి ప్లాజా వద్ద టోల్ ఫీజును వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త విధానంలో దీనికి స్వస్తి పలకనున్నారు.

కొత్త శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్ విధానాన్ని ఈ మార్చి నెలాఖరులోగా అమలు చేస్తామని గడ్కరీ గత ఏడాది డిసెంబర్ లోనే ప్రకటించారు. అయితే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. మార్చి నెలాఖరు వరకు శాటిలైట్ టోల్ కలెక్షన్ సిస్టమ్ ను ప్రారంభించడం సాధ్యం కాలేదని గడ్కరీ తెలిపారు. ఈ సందర్భంగా నకొత్త టోల్ ట్యాక్స్ విధానం సమయం, ఇంధనాన్ని ఆదా చేయడానికి ఎలా సహాయపడుతుందో గడ్కరీ వివరించారు.

జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలు ప్రస్తుతం ఫాస్టాగ్ అనే ఆర్ఎఫ్ఐడీ టెక్నాలజీ ద్వారా టోల్ ఫీజును వసూలు చేస్తున్నాయి. 2021 ఫిబ్రవరి 15 నుంచి టోల్ వసూలుకు ఫాస్టాగ్ లను తప్పనిసరి చేశారు. ఆర్ఎఫ్ఐడీ ఆధారిత బారియర్ ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజు ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. బారియర్ వద్ద ఏర్పాటు చేసిన కెమెరాలు వాహనాల ఫాస్టాగ్ ఐడీలు స్కాన్ చేస్తాయి. అనంతరం, నిర్ణీత మొత్తంలో టోల్ రుసుము వసూలు అవుతుంది.