iDreamPost

పేపర్‌ లీక్‌ కట్టడికి కఠిన చట్టం.. 10 ఏళ్ల జైలు, రూ.కోటి జరిమానా

  • Published Jun 22, 2024 | 9:29 AMUpdated Jun 22, 2024 | 9:29 AM

NEET, NET 2024 Paper Leak: పేపర్‌ లీక్‌ ఘటనలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. వీటి కట్టడికి కఠిన చట్టం అమలుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..

NEET, NET 2024 Paper Leak: పేపర్‌ లీక్‌ ఘటనలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. వీటి కట్టడికి కఠిన చట్టం అమలుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..

  • Published Jun 22, 2024 | 9:29 AMUpdated Jun 22, 2024 | 9:29 AM
పేపర్‌ లీక్‌ కట్టడికి కఠిన చట్టం.. 10 ఏళ్ల జైలు, రూ.కోటి జరిమానా

పోటీ పరీక్షల కోసం యువత ఎలా కష్టపడి చదువుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉద్యోగం, వేర్వేరు కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పోటీ పరీక్షలకు తీవ్రమైన పోటీ ఉంటుంది. ఏటా లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఇలాంటి పరీక్షలు రాస్తుంటారు. కానీ కొందరు స్వార్థపరులు మాత్రం.. అడ్డదారులు తొక్కి.. ఈ పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తుంటారు. డబ్బుకు కక్కుర్తి పడి కొందరు వ్యక్తులు.. పోటీ పరీక్షల పేపర్లను లీక్‌ చేస్తుంటారు. లక్షల రూపాయలు దండుకోవడం కోసం పోటీ పరీక్షా పేపర్లను లీక్‌ చేసి.. నిరుద్యోగులు, పోటీ పరీక్షలకు తయారయ్యే వారికి అన్యాయం చేస్తారు. గతంలో తెలంగాణలో గ్రూప్‌ 1 పరీక్ష పేపర్‌ లీక్‌ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో స్వయంగా చూశాం. ఈ ఘటన ఏకంగా ప్రభుత్వ మార్పుకు మూలకారణమైంది.

అదలా ఉంచితే.. తాజాగా దేశవ్యాప్తంగా నీట్, నెట్ సహా పలు పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్నాలు లీక్‌ కావడం దేశంలో సంచనలంగా మారింది. ఈ అంశం కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. దీనిపై యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పేపర్‌ లీక్‌ అంశం.. విపక్షాలకు బ్రహ్మాస్త్రంగా మారింది. ఇది కాస్త కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో.. పేపర్‌ లీక్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసకుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయ్యింది. పేపర్‌ లీక్‌కు పాల్పడే వారికి కఠిన శిక్ష, భారీ ఎత్తున జరిమానా విధించేలా నూతన చట్టాన్ని అమలు చేయడానికి రెడీ అయ్యింది.

పేపర్‌ లీక్‌ ఘటలను కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం.. ది పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) చట్టం 2024ను తీసుకొచ్చింది. ఈ చట్టం జూన్‌ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు శుక్రవారం రాత్రి గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వాస్తవానికి ఈ చట్టాన్ని లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలోనే చేశారు. కానీ, సార్వత్రిక ఎన్నికలు మొదలు కావడంతో అమలు తేదీని ప్రకటించలేదు. ఇలా ఉండగా ఇప్పుడు నీట్‌, నెట్‌ పరీక్షా పేపర్లు లీక్‌ కావడంతో.. ఇది దేశాన్ని కుదిపేస్తుంది. ఈ క్రమంలో దీన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు రెడీ అవుతోంది.

ఈ క్రమంలో నీట్, నెట్ వివాదంపై గురువారం జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ దీనిపై స్పందిస్తూ.. చట్టం గురించి న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తోందని, త్వరలో నోటిఫై చేస్తామని చెప్పుకొచ్చారు. ఆయన ప్రకటన చేసిన24 గంటల్లోనే ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్‌ జారీచేయడం గమనార్హం. ఇక కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. చట్టవిరుద్ధంగా పరీక్ష పత్రాలను అందుకున్నా, ప్రశ్నలు, సమాధాలు లీక్‌ చేసినా, పరీక్షకు హాజరయ్యేవారికి అనుచిత సాయం చేసినా, సాంకేతికత సాయంతో కంప్యూటర్ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్‌ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహణ, నకిలీ హాల్‌టిక్కెట్లు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు.

ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి కనీసం మూడేళ్ల.. గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇందులో భాగస్వాములైనవారు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు. అంతేకాదు, పరీక్ష నిర్వహణకు అయిన మొత్తాన్ని వారి నుంచి వసూలు చేస్తారు. ఇకపై పేపర్‌ లీకేజీలపై కొత్త చట్టం కింద నాన్-బెయిల్‌బుల్ కేసులు నమోదు చేయనున్నారు. అధికారుల పాత్ర ఉంటే వారికి మూడేళ్ల జైలు.. రూ.కోటి జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి