Dharani
Ayodhya Mosque Construction: అయోధ్యలో రామ మందిర ప్రాంరభోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. మరి మసీదు నిర్మాణం కోసం యూపీ ప్రభుత్వం స్థలం కేటాయించింది. మరి దాని పరిస్థితి ఏంటి అంటే..
Ayodhya Mosque Construction: అయోధ్యలో రామ మందిర ప్రాంరభోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. మరి మసీదు నిర్మాణం కోసం యూపీ ప్రభుత్వం స్థలం కేటాయించింది. మరి దాని పరిస్థితి ఏంటి అంటే..
Dharani
సుమారు 500 ఏళ్ల పాటు కొనసాగిన అయోధ్య రామ జన్మభూమి వివాదం.. 2019 సుప్రీం కోర్టు తీర్పుతో ముగిసింది. వివాదంలో ఇరుక్కున్న 2.77 ఎకరాల భూమిని రాముడి మందిరానికి ఇవ్వాలన్న సుప్రీంకోర్టు.. ఆ ప్రాంతాన్ని హిందూ సంస్థలకు అప్పగించాలని ఆదేశించింది. అంతేకాక ఆ స్థలంలో మందిరాన్ని నిర్మించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు నేపథ్యంలో.. ఆ స్థలంలో రామ మందిరం నిర్మాణం ప్రారంభించింది అయోధ్య క్షేత్ర ట్రస్ట్. తాజాగా సోమవారం నాడు.. ప్రధాని నరేంద్ర మోదీ.. అయోధ్య మందిరాన్ని ప్రారంభించారు. పండుగ వాతావారణంలో.. ఎంతో వైభవంగా ఈ వేడుక జరిగింది. మరో రెండేళ్లలో అయోధ్య మందిర నిర్మాణం పూర్తి అవుతుందని ప్రకటించారు ట్రస్ట్ సభ్యులు.
ఇదిలా ఉండగా.. అయోధ్య తీర్పు సందర్భంగా.. సుప్రీంకోర్టు.. అయోధ్యలో ముస్లింలకు మసీదు నిర్మించుకునేందుకు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. దాంతో అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం స్థానిక ప్రభుత్వం ముస్లిం సంస్థలకు 5 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి 2020 లో శంకుస్థాపన జరిగి.. ప్రస్తుతం ప్రారంభోత్సవం జరుపుకుంది. కానీ ముస్లింలకు మసీదు కోసం ఇచ్చిన స్థలంలో మాత్రం ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. కనీసం శంకుస్థాపన కూడా చేయలేదు.
అయితే తాజాగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో.. మసీదు ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న ముస్లిం సంస్థ ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) కీలక ప్రకటన చేసింది. తొందరలోనే అయోధ్యలో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ప్రకటించింది. ఈ ఏడాది మే నెలలో అయోధ్యలో గ్రాండ్ మసీదు నిర్మాణం ప్రారంభం అవుతుందని.. ఐఐసీఎఫ్ డెవలప్‌మెంట్ కమిటీ హెడ్ హాజీ అరాఫత్ షేక్ వెల్లడించారు.
ఆ మసీదు నిర్మాణం పూర్తి చేయడానికి 3 నుంచి 4 సంవత్సరాలు పట్టవచ్చని అంచనా వేశారు. అయితే అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం గాను.. విరాళాలు సేకరించాలని సదరు సంస్థ నిర్ణయం తీసుకుంది. డబ్బును సేకరించేందుకుగాను క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు సంస్థ సభ్యులు. అయోధ్యలో నిర్మించనున్న మసీదుకు మహమ్మద్ ప్రవక్త పేరు మీద మసీదు ముహమ్మద్ బిన్ అబ్దుల్లా అని పేరు పెట్టనున్నట్లు హాజీ అరాఫత్ షేక్ స్పష్టం చేశారు.
ప్రజల మధ్య శత్రుత్వం, ద్వేషం తొలగించి.. ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకునేలా మార్పు తీసుకురావడం కోసమే తమ ప్రయత్నమని వెల్లడించారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా.. ప్రజలకు, భవిష్యత్ తరాలకు మంచి విషయాలు నేర్పితే ఈ వివాదాలన్నీ సమసిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు.. మసీదు నిర్మాణంలో ఆలస్యమవుతోందని.. ఐఐసీఎఫ్ సెక్రటరీ అథర్ హుస్సేన్ తెలిపారు. మసీదు డిజైన్‌లో మరిన్ని సంప్రదాయ అంశాలను జోడించాలని కోరినట్లు తెలిపారు.