ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ గత కొన్ని నెలలుగా అట్టుడుకుతోంది. రెండు జాతుల మధ్య జరుగుతున్న తీవ్ర ఘర్షణలతో ఆ స్టేట్ రగులుతోంది. రెండు నెలల నుంచి జరుగుతున్న హింసాత్మక ఘటనలు, లూటీలు, దాడులతో మణిపూర్ ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు. హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా 140 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. హింసను కట్టడి చేసేందుకు సర్కారు ఎన్ని చర్యలు చేపట్టినా అంతగా ఫలించడం లేదు. ఈ క్రమంలోనే మణిపూర్‌లో దారుణమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు స్త్రీలను నగ్నంగా ఊరేగించి, ఆ తర్వాత వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
మణిపూర్ రాష్ట్రానికి రాజధాని నగరమైన ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్పోక్పి జిల్లాలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఈ హేయమైన ఘటన మే 4వ తేదీన జరిగిందని ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ ఆరోపించింది. ఈ దిగ్భ్రాంతికర ఘటనకు ముందు ఇంఫాల్ లోయలో మెజారిటీ వర్గమైన మైతీలు, కొండ ప్రాంతాల్లో ఉండే కుకీ సామాజిక వర్గాల నడుమ ఘర్షణలు చెలరేగాయి. మహిళలను నగ్నంగా ఊరేగించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాంగ్‌పోక్సిలో ఈ ఘటన జరగలేదని మణిపూర్ పోలీసులు చెప్పడం వివాదానికి దారితీసింది. ఈ అమానుష ఘటన వేరే ప్రాంతంలో జరిగిందని.. కాంగ్‌పోక్సిలో కాదని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనపై మణిపూర్ సీఎం బీరేంద్ర సింగ్ ఇన్వెస్టిగేషన్‌కు ఆదేశించారు. కాగా, ఇద్దరు యువతులను నగ్నంగా మార్చి వేధించిన ఈ కేసులో ప్రధాన నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీన్ని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. మిగతా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారని తెలిసింది. ఇక, కీచక పర్వానికి తెగబడిన నిందితుడ్ని పోలీసు స్టేషన్లో ఉంచిన ఫొటోను స్థానిక మీడియా చూపించింది.