Krishna Kowshik
భారత్ పై నోరు పారేసుకున్న మాల్దీవుల అధ్యక్షుడు.. ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. మొన్నటి వరకు కయ్యానికి కాలు దువ్విన అతడి స్వరం మారింది .. ఎందుకంటే..?
భారత్ పై నోరు పారేసుకున్న మాల్దీవుల అధ్యక్షుడు.. ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. మొన్నటి వరకు కయ్యానికి కాలు దువ్విన అతడి స్వరం మారింది .. ఎందుకంటే..?
Krishna Kowshik
విహార యాత్రలకు వెళ్లాలంటే బెస్ట్ ఛాయిస్ మాల్దీవులు. సినీ సెలబ్రిటీలు ఎక్కువగా సేద తీరే విడిది కేంద్రం మాల్దీవులు. అక్కడ అందాలకు ముగ్దులైన భారతీయులు వీలు కుదిరితే.. అక్కడకు వలస కట్టేవారు. ఆ ద్వీప దేశం ఆర్థిక వ్యవస్థలో మూడో వంతు పర్యాటక రంగానిదే. కాగా ఈ దేశాన్ని పర్యటిస్తున్న విదేశీయుల్లో భారతీయులే ఎక్కువ. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని మోడీ లక్షద్వీప్ లో పర్యటించారు. భారత పర్యాటక రంగాన్ని ప్రోత్సాహం అందించేలా లక్ష ద్వీప్ ఫోటోలను ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. దీంతో వివాదం రాజుకుంది. భారతీయులపై నోరు పారేసుకున్నారు మాల్డీవుల మంత్రులు. అదే సమయంలో చైనా పర్యటనలో ఉన్న దేశ అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు ప్రతికూల వ్యాఖ్యలు, చర్యలు అగ్నికి ఆజ్యం పోశాయి.
గత నవంబర్‌లో అధికారంలోకి వచ్చిన మయిజ్జు.. భారతీయ సైనికుల బృందం దేశాన్ని విడిచి పెట్టి వెళ్లాలంటూ ప్రకటన చేయడంతో ఈ వివాదం మొదలైంది. తన ఎన్నికల సమయంలో కూడా ఆపదలో అండగా నిలిచిన ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాయ్ కాట్ ఇండియా నినాదంతోనే ఆయన ఎన్నికల్లో గెలిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా భారత వ్యతిరేక చర్యలు తీసుకున్నారు. స్వయంగా ప్రధాని మోడీపై ఆ దేశ మంత్రులు నోరు పారేసుకున్నా కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోయారు. దీంతో మాల్దీవులు మంత్రుల చర్యలకు వ్యతిరేకంగా భారతీయ పర్యాటకులు.. విమాన టికెట్లు రద్దు చేసుకున్నారు.
దీంతో మయిజ్జు చర్యలపై అక్కడ ప్రతిపక్షాల్లోనే కాదూ అధికార పక్షంలోని కొంత మంది తప్పు పట్టారు కూడా. కానీ వివాదం సద్దుమణగలేదు. అయితే ఇప్పుడు అతడి స్వరం మారింది. భారత్.. ఆ దేశానికి కొంత రుణం ఇచ్చింది. ఇప్పుడు ఆ అప్పులు చెల్లించాల్సి వచ్చేటప్పటికి మెత్తటి మాటలు మాట్లాడుతున్నాడు ఆ దేశ అధ్యక్షుడు. తాము స్థాయికి మించి భారత్ నుండి అప్పులు తీసుకున్నామని, ఇప్పుడు తాము చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని అన్నారు. మాల్దీవులకు సహాయకారిగా ఉండే రుణ చెల్లింపు ప్రణాళికలను ప్రకటించాలని ఇండియాకు విన్నవిస్తున్నాడు ఆ దేశ అధ్యక్షుడు మయిజ్జు. అంతేనా పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. తమకు అత్యంత ఆప్త దేశం భారత్ అంటూ ప్రశంసిస్తున్నాడు. ఆయన తీరు చూస్తుంటే.. అందితే కాళ్లు.. అందకపోతే జుట్టు అన్నట్లుగా ఉంది.