P Krishna
P Krishna
ప్రపంచంలో టెక్నాలజీ ఎంతగానో అభివృద్ది చెందుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు చెందుతున్నాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ సర్వసాధారణం అయ్యింది. స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచం మన అరచేతిలో ఉన్నట్లే. అయితే స్మార్ట్ ఫోన్ తో ఎంత సౌకర్యం ఉందో.. అప్పుడప్పుడు అవి పేలిపోవడం వల్ల అనర్థాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా సెల్ ఫోన్ పేలి కిటికీలు, కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల తరుచూ సెల్ ఫోన్లు పేలిపోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు ఈ ప్రమాదంలో మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి. తీవ్ర గాయాలపాలైతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో సిడ్కో ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో ముగ్గురు వ్యక్తులు నివసిస్తున్నారు. బుధవారం ఇంట్లో చార్జింగ్ పెట్టిన మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పెలిపోయింది. బాంబులా పేలుడు శబ్ధం వినిపించడంతో చుట్టు పక్కల వాళ్లంతా ఒక్కసారే హడలిపోయారు.
పేలుడు ధాటికి ఇంటి ఆవరణలో ఉన్న వాహనాలు అద్దాలు, కిటికీలు ధ్వంసం అయ్యాయి. ఇంట్లో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మొబైల్ కు ఛార్జింగ్ పెడుతున్న సమయంలో పక్కన ఉంచిన పెర్ఫ్యూమ్ బాటిల్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవొచ్చని అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. బాంబ్ పేలుడు లా శబ్ధం రావడంతో స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.