కన్న తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకునే శ్రవణ కుమారులే నేటి సమాజంలో కరువైపోయారు. శ్రవణ కుమారుడిలా అమ్మానాన్నలను కావడిలో మోయకున్నా గానీ.. కనీసం కడుపునిండా అన్నం పెట్టే కొడుకులను వేళ్లపై లెక్కించే దుస్థితి వచ్చింది. ఇవన్నీ ఒకెత్తు అయితే.. కన్న తల్లిదండ్రులని కూడా చూడకుండా, వారి ప్రాణాలను తీసే కసాయి కొడుకులు ఎక్కువై పోయారు సమాజంలో. తాజాగా మద్యం మత్తులో ఓ యువకుడు కన్న పేగునే కడతేర్చాడు. తల్లిదండ్రులను కొట్టి చంపాడు ఆ కిరాతకుడు. ఈ హృదయ విదారక సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
మద్యం మత్తులో కన్న తల్లిదండ్రులను చంపిన ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది బెంగళూరు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భాస్కర్-శాంత మంగళూరుకు చెందిన ఈ దంపతులు కొన్ని సంవత్సరాలుగా బెంగళూరులోని న్యూటింబర్ డిపో లేఔట్ లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి వేరే చోట ఉద్యోగం చేస్తుండగా.. చిన్న కుమారుడు శరత్(26) తల్లిదండ్రులతో ఉంటున్నాడు. గత కొంతకాలంగా మానసిక వ్యాధిపీడితుడైన శరత్.. తరచుగా తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకుని వారిని చిత్రహింసలకు గురిచేసేవాడని స్థానికులు వివరించారు.
ఈ క్రమంలోనే సోమవారం మద్యం తాగి వచ్చిన శరత్.. అమ్మానాన్నలతో గొడవ పడి వారిని ఇనుప రాడ్ తో కొట్టి పారిపోయాడు. మంగళవారం ఉదయం ఇంటి చుట్టు పక్కల వారు చూసేసరికి శాంత(60), భాస్కర్(63) నెత్తుడి మడుగులో విగతజీవులుగా పడివున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శరత్ కోసం గాలిస్తున్నారు. కాగా.. శాంత ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిగా పదవీ విరమణ చేశారు. తండ్రి భాస్కర్ ఓ హోటల్ లో క్యాషియర్ గా పనిచేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఇదికూడా చదవండి: టాలీవుడ్‌లో విషాదం.. మిథునం రచయిత శ్రీరమణ కన్నుమూత!