iDreamPost
android-app
ios-app

కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రం పేరు మారుస్తూ బిల్‌ పాస్‌!

కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రం పేరు మారుస్తూ బిల్‌ పాస్‌!

కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం పేరును మారుస్తూ అసెంబ్లీలో ఏక గ్రీవంగా బిల్లును పాస్‌ చేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. ఇప్పుడున్న కేరళ అనే పేరును ‘కేరళం’గా మారుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సభ్యులు ఏక గ్రీవంగా ఈ బిల్లుకు అంగీకారం తెలిపారు. ఏ పార్టీ కూడా ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. బిల్లులో మార్పులను కూడా సూచించలేదు. బిల్లు పాసయిన అనంతరం దాన్ని కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు.

కేంద్ర ప్రభుత్వానికి పంపిన బిల్లులో ఈ వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘ మా రాష్ట్రం పేరు మలయాళంలో కేరళం అని ఉంది. 1956, నవంబర్‌ 1న భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. అదే రోజును కేరళ ఆవిర్భావ దినోత్సంగా జరపుతున్నాము. స్వాతంత్ర ఉద్యమం మొదలైన నాటి నుంచి మలయాళం మాట్లాడేవారు తమకంటూ ఓ రాష్ట్రం కావాలని గట్టిగా కోరుకున్నారు. బాషా ప్రాతిపదికన రాష్ట్రం ఏర్పడినప్పటికి రాజ్యాంగం మొదటి షెడ్యూల్‌లో రాష్ట్రం పేరు ‘కేరళ’గా నమోదైంది.

ఆర్టికల్‌ 3 ప్రకారం మా రాష్ట్రం పేరు ‘కేరళ’ నుంచి ‘కేరళం’గా మార్చాలని కోరుకుంటున్నాము. ఇందుకు సంబంధించిన ఈ బిల్లుకు అతి త్వరగా ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని ఉంది. ఇక, కేరళం అనే పేరు చేరమ్‌ అనే పదం నుంచి వచ్చినట్లు పండితులు భావిస్తున్నారు. గోకర్ణం నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ప్రాంతాన్ని కేరళం లేదా చేరమ్‌ అని అంటారని జర్మన్‌కు చెందిన హెర్మన్‌ గుండర్ట్‌ తాను రాసిన మలయాళం- ఇంగ్లీష్‌ డిక్షనరీలో పేర్కొన్నారు. మరి, ప్రభుత్వం కేరళ పేరును ‘కేరళం’గా మార్చటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.