Kerala Gramin Bank: వయనాడ్ వరద బాధితులకు అందిన సాయం నుంచి ఈఎంఐ కట్ చేసుకున్న బ్యాంకు

వయనాడ్ వరద బాధితులకు అందిన సాయం నుంచి ఈఎంఐ కట్ చేసుకున్న బ్యాంకు

Bank Deducted Relief Funds As EMI: వయనాడ్ వరదల వల్ల అన్నీ కోల్పోయి రోడ్డున పడి దిక్కులేని స్థితిలో ఉంటే ఈఎంఐ డేట్ వచ్చేస్తుంది.. సిద్ధంగా ఉండండి.. ఈఎంఐ ఎప్పుడు కడతారు? అంటూ ఫోన్లు చేస్తున్నారు. ఒక బ్యాంక్ అయితే సాయంగా అందిన డబ్బులని కూడా ఈఎంఐగా కట్ చేసేసుకుంది.

Bank Deducted Relief Funds As EMI: వయనాడ్ వరదల వల్ల అన్నీ కోల్పోయి రోడ్డున పడి దిక్కులేని స్థితిలో ఉంటే ఈఎంఐ డేట్ వచ్చేస్తుంది.. సిద్ధంగా ఉండండి.. ఈఎంఐ ఎప్పుడు కడతారు? అంటూ ఫోన్లు చేస్తున్నారు. ఒక బ్యాంక్ అయితే సాయంగా అందిన డబ్బులని కూడా ఈఎంఐగా కట్ చేసేసుకుంది.

కేరళలోని వయనాడ్ జిల్లాలో వరదల కారణంగా ప్రజలు తమ ఇళ్ళు, ఆస్తులు అన్నీ కోల్పోయి రోడ్డున పడ్డారు. దిక్కు లేని స్థితిలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ప్రైవేట్ బ్యాంకుల వారు, ఫైనాన్స్ కంపెనీ వారు వయనాడ్ బాధితులకు ఫోన్ చేసి ఈఎంఐ చెల్లించమని బలవంతం చేయడం మొదలుపెట్టారు. బతికే ఉన్నారు కదా.. ఈఎంఐ కట్టండి అంటూ కనికరం లేకుండా మాట్లాడుతున్నారు. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. సదరు ఏజెంట్ల మీద చర్యలు కూడా తీసుకున్నారు అధికారులు. తాజాగా మరో బ్యాంకు కూడా కనికరం లేకుండా బ్యాంకులో పడ్డ సాయం డబ్బులోంచి ఈఎంఐ కట్ చేసుకుంది కేరళ గ్రామీణ బ్యాంకు. 

వయనాడ్ వరద బాధితులకు అండగా పలువురు సెలబ్రిటీలు ముందుకొచ్చి తమ వంతు ఆర్థిక సాయం అందజేసిన విషయం తెలిసిందే. కేరళ సీఎం ఫండ్ కి భారీగా విరాళాలు అందించారు. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం ఇటీవల వయనాడ్ వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులకు అత్యవసర సాయం కింద 10 వేల రూపాయలు అందించింది. ఈ మొత్తాన్ని నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అయితే ఈ ఖాతాలన్నీ కేరళ గ్రామీణ బ్యాంకుకి చెందినవి. పది వేలు ఇలా పడ్డాయో లేదో బ్యాంకు ఆ సాయం డబ్బుని ఈఎంఐ కింద కట్ చేసుకుంది. అసలే అన్నీ కోల్పోయి దిక్కు లేక మేము ఏడుస్తుంటే వచ్చిన ఆ కొంత డబ్బుని కూడా ఈఎంఐ కింద కట్ చేసుకోవడం ఏంటి అని జనాలు మండిపడుతున్నారు.

ఈ విషయం సీఎం దృష్టికి ఎల్లడంతో ఆయన బ్యాంకు తీరుపై మండిపడ్డారు. వయనాడ్ వరద బాధితుల రుణాలను మాఫీ చేయాలని ఆయన ఇది వరకే వివిధ బ్యాంకులను కోరారు. వడ్డీని తగ్గించడం, ఈఎంఐ పేమెంట్ తేదీని పొడిగించడం వంటి వాటి వల్ల వరద బాధితులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. అందుకే వెంటనే రుణాలను మాఫీ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని బ్యాంకులను కోరారు. ఇటువంటి క్లిష్ట సమయంలో బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి లోన్ ఈఎంఐ కట్ చేసుకోవడం పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేరళ గ్రామీణ బ్యాంకుల్లో 50 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానిదే అని.. మిగిలిన 50 శాతంలో పీఎస్యూ కెనరా బ్యాంకు ద్వారా కేంద్రానికి 35 శాతం వాటా వెళ్తుందని అన్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి 15 శాతం వాటా మాత్రమే ఉందని అన్నారు. వరద సాయం కింద అందిన సొమ్ముని బ్యాంకులు ఈఎంఐల కింద కట్ చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు.

రద బాధితుల కోసం అందిన సాయం నుంచి 5 వేల రూపాయలు ఈఎంఐ కింద కట్ అయ్యాయని బాధితులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై కేరళ రాష్ట్ర సహకార మంత్రి వాసవన్ స్పందించారు. బాధితుల కోసం అందిన సాయం నుంచి ఈఎంఐ కట్ చేసుకోవడాన్ని స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఇటువంటి క్లిష్టమైన సమయంలో బ్యాంకులు మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అయితే ఈ వ్యవహారంపై స్థానిక గ్రామీణ బ్యాంక్ చీఫ్ తో చర్చించామని స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ జనరల్ మేనేజర్ కేఎస్ ప్రదీప్ వెల్లడించారు. కొండచరియలు విరిగిపడడానికి ముందే ఇచ్చిన ఆదేశాల వల్ల ఈఎంఐలు కట్ అయినట్లు వివరించారు. అయితే వరద బాధితుల ఖాతాల నుంచి కట్ చేసుకున్న ఈఎంఐ డబ్బులని తిరిగి వారి ఖాతాల్లో జమ చేయాలని వయనాడ్ డిప్యూటీ కలెక్టర్ కేరళ గ్రామీణ బ్యాంకుకు ఆదేశాలు జారీ చేశారు.

Show comments