గత కొన్ని రోజులుగా కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరీ ముఖ్యంగా నిత్యం కూరలో వాడే టమాటా ధరలు అందనంత ఎత్తుకు వెళ్లాయి. ప్రస్తుతం టమాటా ధరలు మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. దాంతో టమాటాలు పండించిన రైతులు కోటీశ్వరులు అవుతున్నారు. ఇక టమాటాలకు సీసీ కెమెరాలు, బౌన్సర్లను కాపలా పెట్టి మరీ తమ పంటను కాపాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే టమాటా ధరతో పోటీ పడుతోంది చింత పండు ధర. దాంతో పేద, మధ్యతరగతి వర్గాలపై భారం పడబోతోంది.
టమాటా.. ప్రస్తుతం మార్కెట్ లో ఇదే ట్రెండింగ్ న్యూస్. విపరీతంగా పెరిగిన టమాటా ధరలతో సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక టమాటా ధరలు పెరగడంతో.. సామాన్య ప్రజలు సెకండ్ ప్రయారిటీ కింద చింత పండును వాడటం మెుదలు పెట్టారు. దాంతో మార్కెట్ లో చింత పండుకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే టమాటాకు తానేం తక్కువ కాదు అన్నట్లుగా చింత పండు ధరలు పెరిగిపోతున్నాయి. గతంలో కేజీ చింత పండు ధర రూ. 80 నుంచి రూ. 200ల వరకు ఉండేది.
ప్రస్తుతం చింత పండుకు డిమాండ్ పెరగడంతో.. ధర అమాంతం పెరిగిపోతోంది. ప్రస్తుతం కేజీ చింత పండు రూ. 120 నుంచి రూ. 200కి ఎగబాకింది. మరికొన్ని రోజుల్లో ఈ ధర రూ. 300 వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. డిమాండ్ పెరగడం, సరిపడా సరఫరా లేకపోవడంతోనే ధరలు పెరుగుతున్నాయని తుమకూరుకు చెందిన చింతపండు రైతు మంజునాథ పేర్కొన్నాడు. మరికొన్ని వారాలు ఇలాగే కొనసాగితే.. చింతపండు ధర ఆల్ టైమ్ అధిక ధరకు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
ఇక ఈ వార్త తెలియడంతో.. సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టమాటా, ఇతర కూరగాయల ధరలు గాయాలు చేస్తుంటే.. కొత్తగా మరో పిడుగు పడబోతుందని తెలిసి షాక్ కు గురవుతున్నారు. 2021-22లో కర్ణాటకలో చింతపండు సాగు విస్తీర్ణం 10,508 హెక్టార్లకు పడిపోగా.. కేవలం 40,068 టన్నుల ఉత్పత్తి మాత్రమే వచ్చింది. చింతపండుకు తగిన మార్కెట్ సమతూల్యత లేకపోవడంతో పాటుగా శీతల గిడ్డంగులు కూడా లేకపోవడం ధరలు పెరగడానికి ప్రధాన కారణమని సాగు దారులు అంటున్నారు.
ఇదికూడా చదవండి: కొడుకు చేసిన తప్పు.. శిక్ష వేసుకున్న తండ్రి!