iDreamPost
android-app
ios-app

జ్ఞానవాపి మసీదు కేసులో సంచలన మలుపు.. అందుకు అనుమతి ఇచ్చిన కోర్టు!

  • Author singhj Published - 06:29 PM, Fri - 21 July 23
  • Author singhj Published - 06:29 PM, Fri - 21 July 23
జ్ఞానవాపి మసీదు కేసులో సంచలన మలుపు.. అందుకు అనుమతి ఇచ్చిన కోర్టు!

ప్రసిద్ధ కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు కేసులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మసీదు ప్రాంగణంలో ఆర్కియాలజికల్ సర్వే చేసేందుకు వారణాసి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నేతృత్వంలో మసీదులో సర్వే చేసేందుకు అంగీకరించింది. మసీదులో శాస్త్రీయ సర్వేకు ఓకే చెప్పిన కోర్టు.. వాజూఖానా ప్రాంతంలో మాత్రం సర్వేకు నిరాకరించింది. ఇక్కడే శివలింగం ఉందని హిందూ మత సంఘాలు చెబుతున్న నేపథ్యంలో ఇది ఆసక్తికరంగా మారింది. వాజూఖానా ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వే పరిధిలోకి తీసుకురాకూడదని కోర్టు స్పష్టం చేసింది.

ఒక హిందూ సంఘం వేసిన పిటిషన్​ విచారణ సందర్భంగా కోర్టు ఈ తీర్పునిచ్చింది. మసీదు కేసులో జులై 14న వాదనలు విన్న కోర్టు.. అన్నీ పరిశీలించి సర్వేకు ఓకే చెప్పింది. ఈ విషయాన్ని హిందువుల తరఫున పిటిషన్ దాఖలు చేసిన విష్ణు శంకర్ జైన్ తెలిపారు. ఈ కేసులో ఇది టర్నింగ్ పాయింట్ అని హిందువుల తరఫున వాదించిన అడ్వకేట్ సుభాష్ నందన్ చతుర్వేది అన్నారు. ‘మసీదు ప్రాంగణంలో శాస్త్రీయంగా ఆర్కియాలజీ సర్వే జరపాలని నేను పెట్టుకున్న అప్లికేషన్​ను కోర్టు అంగీకరించింది. అయితే వాజూఖానా ప్రాంతంలో కాకుండా మిగతా అన్ని చోట్ల ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది’ అని పిటిషనర్ శంకర్ జైన్ చెప్పుకొచ్చారు.

ఇకపోతే, జ్ఞానవాపి మసీదు విషయంలో గతంలో హిందువుల తరఫున ఒక పిటిషన్ దాఖలైంది. మసీదు ప్రాంగణంలో సర్వే చేయడంతో పాటు శివలింగానికి పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు పిటిషన్ వేశారు. శివలింగంతో పాటు మసీదు గోడకు అవతల వైపు ఉన్న వినాయకుడు, హనుమంతుడు, నంది విగ్రహాలకూ పూజ చేసేందుకు పర్మిషన్ కావాలని కోరారు. అయితే.. మహిళలు వేసిన పిటిషన్​పై విచారణలో మసీదు కమిటీ తీవ్ర అభ్యంతరాలు తెలిపింది. హిందువులు అంటున్నట్లు ఔరంగజేబు ఇక్కడి ఆలయాన్ని కూలగొట్టి మసీదు కట్టాడనేది పూర్తిగా నిరాధారమైన ఆరోపణ అని వాదించింది. మసీదు ప్రాంగణంలో ఎక్కడా శివలింగం కనిపించలేదని తేల్చి చెప్పింది. ఈ కేసులో ఆర్కియాలజీ సర్వేకు సుప్రీం కోర్టు నో చెప్పింది. కానీ అందుకు భిన్నంగా వారణాసి కోర్టు అనుమతిని ఇవ్వడం గమనార్హం.