iDreamPost
android-app
ios-app

ఉదయనిధి స్టాలిన్ పై ఎఫ్ఐఆర్ నమోదు!

  • Published Sep 06, 2023 | 12:17 PM Updated Updated Sep 06, 2023 | 12:55 PM
  • Published Sep 06, 2023 | 12:17 PMUpdated Sep 06, 2023 | 12:55 PM
ఉదయనిధి స్టాలిన్ పై ఎఫ్ఐఆర్ నమోదు!

ఈ మధ్య దేశంలో సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు చేస్తున్న కాంట్రవర్సీ కామెంట్స్ క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. సనాతన ధర్మంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే సమర్ధించారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడినందుకు బీజేపీ నేతలు డీఎంకే పార్టీపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఉదయ్ నిధి స్టాలిన్, ప్రియాంక్ ఖర్గేలపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

శనివారం తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్.. చెన్నైలో తేనాంపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ లాంటిదని.. దాన్ని నిర్మూలించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు అంటూ హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను.. కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే సమర్ధించారు. దీంతో విషయం మరింత కాంట్రవర్సీగా మారిపోయింది. దేశవ్యాప్తంగా వీరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సనాతన ధర్మంపై కామెంట్స్ చేసిన మంత్రి ఉదయనిధి స్టాలిన్, సమర్ధించిన ప్రియాంక్ ఖర్గే లపై ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఒక హోదాలో ఉండి హిందూ మతాన్ని విశ్వసించే వారి మతపరమైన మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేయడంపై.. లాయర్లు రామ్ సింగ్ లోధి, హర్ష్ గుప్తాలు.. కొత్వాలి సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, న్యాయవాదులు హర్ష్ గుప్తా, రామ్ సింగ్ లోధి ఫిర్యాదు మేరకు ఇద్దరిపై ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఇద్దరిపై ఐపీసీ సెక్షన్లు 295 ఏ, 153 ఏ కింద కేసు నమోదు చేశామన్నారు. కాగా, ఈ కేసు విచారణ సెప్టెంబర్ 15న జరగనుంది. మరి ఉదయనిధి స్టాలిన్ పై, అతన్ని సమర్ధించిన ప్రియాంక్ ఖర్గేపై ఎఫ్ఐఆర్ నమోదవ్వడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.