ఆటోమొబైల్ ఇండస్ట్రీలో గత మూడేళ్లలో విప్లవాత్మక మార్పులు వచ్చాయనే చెప్పాలి. పెట్రోల్, డీజిల్ వాహనాల ఉత్పత్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆటోమొబైల్ తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికిల్స్ ప్రొడక్షన్‌ను వేగవంతం చేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ తదితర కారణాలతో కరెంటు బండ్ల ఉత్పత్తిపై ఆటోమొబైల్ సంస్థలు ఫోకస్ పెడుతున్నాయి. మార్కెట్లో కూడా ఈ వెహికిల్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. రోజురోజుకీ పెట్రో ధరలు షాక్‌ను ఇస్తుండటంతో వాహనదారులు ఎలక్రిక్ వెహికిల్స్ కొనేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. భారత మార్కెట్లో ఈ-స్కూటర్లు, ఈ-బైక్‌లు బాగా అమ్ముడుపోతున్నాయి.
పెట్రో రేట్లు పెరుగుతూ పోవడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు తక్కువ ఖర్చు అవుతుండటంతో అందరూ ఈవీలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కార్ల కంపెనీలు కూడా తమ ఈవీ మోడల్స్‌ను ఒక్కొక్కటిగా మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. ప్రభుత్వాలు కూడా కరెంట్ బండ్లకు రాయితీలు ఇస్తూ సపోర్ట్ చేస్తున్నాయి. ఈ తరుణంలో వాహనదారులకు ఒక బ్యాడ్ న్యూస్. ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఛార్జింగ్ పై జీఎస్టీ వసూలు చేయాలని ఒక రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈవీ బ్యాటరీలను పబ్లిక్ ఛార్జింగ్ స్టేషనల్లో ఛార్జింగ్ చేస్తే 18 శాతం చొప్పున జీఎస్టీ వర్తిస్తుందని కర్ణాటక అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ తెలిపింది.
కరెంటు బండ్ల కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే విషయాన్ని ఒక విద్యుత్ పంపిణీ సంస్థ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ సంస్థ ముందుకు తీసుకెళ్లింది. ఇందుకోసం వాహనదారుల నుంచి ట్యాక్స్‌తో పాటు ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఛార్జింగ్ ఫీజునూ వసూలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది. దీంట్లో ఎనర్జీ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు కలిపి ఉంటాయి. అయితే ఇంధన ఛార్జీలను వస్తువుల సరఫరాగా పరిగణిస్తారా లేదా అనే సందేహం ఏర్పడింది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఛార్జింగ్‌ను విద్యుత్ సరఫరా కేటగిరీ కింద పరిగణించాలా వద్దా అనేది అథారిటీ ఆఫ్ రూలింగ్‌కు సమస్యగా మారింది.
అయితే ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీని ఛార్జ్ చేయడం అంటే విద్యుత్ శక్తిని రసాయన శక్తిగా మార్చే ప్రక్రియ అని రూలింగ్ అథారిటీ తెలిపింది. విద్యుత్‌ను వస్తువుగా వర్గీకరించిన చరాస్తిగా, అలాగే బ్యాటరీల్లో రసాయన శక్తిగా మార్చి వినియోగదారులకు అందిస్తున్నారని ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది. విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక వివరణనూ ఈ సందర్భంగా అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ ప్రస్తావించింది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఛార్జింగ్ అనేది సర్వీస్ కిందకే వస్తుందని.. విద్యుత్ సరఫరా, సర్వీస్ ఛార్జీలను సప్లయ్గా పరిగణించాలని పేర్కొంది. కాబట్టి ఛార్జింగ్‌పై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని తీర్మానించింది. ఒకవేళ ఈ తీర్మాణాన్ని మిగతా రాష్ట్రాలు కూడా ప్రాతిపదికగా తీసుకుంటే దేశం మొత్తం ఈవీల ఛార్జింగ్‌పై జీఎస్టీని వసూలు చేసే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.