SNP
SNP
శత్రుదేశాలు మన దేశ రక్షణకు సంబంధించిన రహస్య సమాచారం తెలుసుకునేందుకు ఎంత నీచానికైనా దిగజారుతాయి. చివరికి అమ్మాయిలను ఎరగా వేసేందుకు కూడా వెనుకాడవు. ఇలా హనీట్రాప్‌లో చిక్కుకుని చాలా మంది కీలక సమాచారాన్ని శత్రుదేశాలు ఇచ్చారు. తాజాగా అలాంటి హనీట్రాప్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన మహిళా నిఘా ఏజెంట్‌కు ఆకర్షితుడైన డీఆర్డీవో(డిఫెన్స్ అండ్ రిసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజెషన్ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్, బ్రహ్మోస్ లాంచర్, డ్రోన్, యూసీవీ, అగ్ని మిస్సైల్ లాంచర్, మిలిటరీ బ్రిడ్జింగ్ సిస్టమ్‌తో పాటు ఇతర విషయాల గురించి వెల్లడించినట్లు తెలుస్తోంది.
జరా దాస్‌గుప్తా పేరుతో పాక్ ఏజెంట్ .. ప్రదీప్‌తో చాటింగ్ చేసినట్లు సమాచారం. డిఫెన్స్ ప్రాజెక్టులకు చెందిన సమాచారాన్ని శాస్త్రవేత్త ఆమెతో పంచుకున్నారని మహారాష్ట్రకు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు కురుల్కర్‌పై కేసు నమోదు చేశారు. పుణెలోని డీఆర్డీవో ల్యాబ్‌లో ప్రదీప్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. మే 3న దేశద్రోహం కేసు కింద ప్రదీప్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. విచారణలో చాటింగ్ వ్యవహారం బయటపడింది. ప్రస్తుతం ఆయన జుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
జరా దాస్‌గుప్తాతో వాట్సాప్ వాయిస్, వీడియో కాల్స్ ద్వారా ప్రదీప్ టచ్‌లో ఉన్నట్లు పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. బ్రిటన్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా దాస్‌గుప్తా సైంటిస్టుతో పరిచేయం చేసుకుంది. రొమాంటిక్ మెసేజ్‌లు, వీడియోలు పంపుతూ ప్రదీప్‌ను ఆకర్షించింది. పోలీసులు దాస్‌గుప్తా ఐపీ అడ్రస్‌ను ట్రేస్ చేయగా ఆమె పాకిస్థాన్‌కు చెందిన మహిళగా గుర్తించారు.