iDreamPost
android-app
ios-app

అలా చేస్తే FASTag ఉన్నా డబుల్ ఛార్జ్ కట్టాల్సిందే!

FasTag: వాహనదారులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ. వాహనం ముందు అద్దంపై ఫాస్టాగ్ ను అమర్చకుంటే రెట్టింపు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.

FasTag: వాహనదారులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ. వాహనం ముందు అద్దంపై ఫాస్టాగ్ ను అమర్చకుంటే రెట్టింపు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.

అలా చేస్తే FASTag ఉన్నా డబుల్ ఛార్జ్ కట్టాల్సిందే!

నేషనల్ హైవేలపై ప్రయాణిస్తున్నప్పుడు టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు టోల్ ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ అనేది ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్. ఇది హైవేలపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద టోల్ పన్నుల చెల్లింపును సులభతరం చేస్తుంది. దీన్ని భారత జాతీయ రహదారుల సంస్థ నిర్వహిస్తోంది. ఇది సదరు వాహన ఫాస్టాగ్‌కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా టోల్ మొత్తాన్ని కట్ చేస్తుంది. తద్వారా నిమిషాలతరబడి టోల్ గేట్‌ల వద్ద వేచిచూసేప్రయాస తప్పుతుంది. అయితే ఎన్ హెచ్ ఏఐ వాహనదారులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. వాహనం ముందు అద్దంపై ఫాస్టాగ్ ను అమర్చకుంటే రెట్టింపు టోల్ ను వసూలు చేయాలని నిర్ణయించింది.

మీరు హైవేల్లో ప్రయాణిస్తున్నప్పుడు మీ వాహనం ముందు అద్దంపై ఫాస్టాగ్ లేకుండా ప్రయాణిస్తున్నారా? అయితే మీ జేబుకు చిల్లుపడ్డట్టే. ఫాస్టాగ్ లేకుండా ప్రయాణిస్తే టోల్ గేట్ల వద్ద డబుల్ టోల్ పే చేయాల్సి వస్తుంది. దీనికి గల కారణం ఏంటంటే.. విండ్ స్క్రీన్ పై ఫాస్టాగ్ ను అతికించకపోవడం వల్ల అనవసర జాప్యం ఏర్పడుతోంది ఎన్ హెచ్ ఏఐ తెలిపింది. ఫలితంగా వాహనాలు బారులు తీరుతున్నాయి. వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

ఈ రద్దీని నియంత్రించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చర్యలు చేపట్టింది. ఫాస్టాగ్ అమర్చని వాహనదారుల నుంచి రెట్టింపు టోల్ వసూలు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. ఇకపై ఉద్దేశ్యపూర్వకంగా ఎవరైనా వాహనదారులు ఫాస్టాగ్ అతికించకుంటే టోల్ గేట్ల వద్ద రెట్టింపు టోల్ పే చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఒకే వాహనానికి ఒకటికి మించి ఫాస్టాగ్‌లు వినియోగించడం లేదా ఒకే ఫాస్టాగ్‌ను వివిధ వాహనాలకు వినియోగిస్తున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ దృష్టికి వచ్చింది. అలాగే కొన్ని సందర్భాల్లో కేవైసీ పూర్తి చేయకుండానే ఫాస్టాగ్‌లు జారీ చేస్తున్నారని తెలిపింది. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టేందుకు ఫాస్టాగ్ కేవైసీ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.