Dharani
రైలులో తన బ్యాగ్ పొగొట్టుకుంది ఓ ప్రయాణికురాలు. దీనికి రైల్వే శాఖదే బాధ్యత అంటూ పోరాటం చేసింది. చివరకు దీనిలో ఆమె విజయం సాధించింది. ఆ వివరాలు.
రైలులో తన బ్యాగ్ పొగొట్టుకుంది ఓ ప్రయాణికురాలు. దీనికి రైల్వే శాఖదే బాధ్యత అంటూ పోరాటం చేసింది. చివరకు దీనిలో ఆమె విజయం సాధించింది. ఆ వివరాలు.
Dharani
సాధారణంగా ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని.. మీ వస్తువులు, లగేజ్‌కి మీరే బాధ్యత వహించాలని అధికారులు పదే పదే హెచ్చరిస్తుంటారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని సందర్భాల్లో దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి ఘటనలు ఎక్కువగా రైలు, రైల్వే స్టేషన్‌లలో చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయలేం. పోలీసులకు ఫిర్యాదు చేయాలి.. మన అదృష్టం బాగుండి దొరికితే ఓకే.. లేదంటే ఇక మనకు ప్రాప్తం లేదు అనుకోవాలి. అయితే కొందరు మాత్రం ఇలాంటి వాటిపై ఏళ్ల తరబడి న్యాయపోరాటం చేసి.. చివరకు విజయం సాధిస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. రైల్వే ప్రయాణికురాలు బ్యాగ్ చోరీకి గురైంది. ఆమె న్యాయ పోరాటం సాగించడంతో.. ప్రయాణికురాలికి డబ్బులు చెల్లించాల్సిందిగా వినియోగదారుల కమిషన్.. రైల్వే శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
8 ఏళ్ల క్రితం రైలులో జరిగిన దొంగతనం ఘటనలో బాధితురాలు.. రైల్వే శాఖపై న్యాయ పోరాటం చేసి.. చివరికి గెలిచింది. దీంతో ఆ మహిళకు అనుకూలంగా తీర్పు వెలువరించిన వినియోగదారుల కమిషన్.. ఆమెకు రూ.1.08 లక్షలు చెల్లించాలంటూ రైల్వే శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సంఘటన 2016లో చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన ఓ మహిళ 2016, జనవరిలో మాల్వా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించింది. ఈ క్రమంలో ఝాన్సీ నుంచి గ్వాలియర్ స్టేషన్ల మధ్య రైలు ప్రయాణిస్తుండగా.. ఆ మహిళ బ్యాగు చోరీకి గురైంది. దానిలో రూ.80 వేల విలువైన వస్తువులు ఉన్నాయని పేర్కొన్న ఆ మహిళ మొదట రైల్వే శాఖకు ఫిర్యాదు చేసింది.
కానీ సిబ్బంది నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. జిల్లా వినియోగదారులు ఫోరంను ఆశ్రయించింది. ప్రయాణికులకు సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడంతోపాటు ప్రయాణికులు, వారి వస్తువుల భద్రత కూడా రైల్వే శాఖదేనని ఆమె వాదించింది. ఆ మహిళ పిటిషన్‌ను విచారణ జరిపిన జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్.. కీలక తీర్పు వెలువరించింది.
మహిళ వాదనను విన్న వినియోగదారుల కమిషన్.. రైల్వే శాఖ సేవల్లో నిర్లక్ష్యం, లోపాలు ఉన్నాయని నిర్ధారించింది. అంతేకాక ఆ మహిళ తన బ్యాగు చోరీ అయినప్పటి నుంచి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే వరకు అనేక చోట్ల తిరగాల్సి వచ్చిందని పేర్కొంది. ఈ వ్యవహారం మొత్తంలో రైల్వే అధికారుల తీరుతో ఆ మహిళ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తేల్చింది. అంతేకాకుండా చట్టపరమైన హక్కుల కోసం అనేక వేధింపులు ఎదుర్కొన్నారని వినియోగదారుల కమిషన్ అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలోనే సంచలన తీర్పు వెల్లడించింది. రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్లే బాధితురాలికి ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న వినియోగదారుల ఫోరం.. ఆమె కోల్పోయిన వస్తువుల విలువ రూ.80 వేలు.. దాంతోపాటు ఆమెకు కలిగిన అసౌకర్యం, మానసిక వేదనకు పరిహారంగా మరో రూ.20 వేలు.. న్యాయ సహాయం కోసం ఆమె ఖర్చు చేసిన మరో రూ.8 వేలు.. మొత్తంగా రూ.1.08 లక్షలు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది.