P Venkatesh
P Venkatesh
భారత్ సత్తాని ప్రపంచానికి చాటి చెప్పిన ప్రయోగం చంద్రయాన్ 3. జాబిల్లి అన్వేషణలో భాగంగా జూలై 14న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రయాన్ 3 ని ప్రయోగించింది. ఆ తర్వాత అన్ని దశలను విజయవంతంగా దాటుకుని సుదీర్ఘ కాలం ప్రయాణించిన విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రపంచంలో చంద్రుడి దక్షిణ దృవంపై కాలుమోపిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అయితే దీని వెనకాల శాస్త్రవేత్తలు, టెక్నీషియన్స్ కృషి మరువలేనిది. కానీ నేడు ఆ ప్రయోగంలో తమ వంతు కృషి చేసిన టెక్నీషియన్స్ టీ, ఇడ్లీ అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. దీనికి గల కారణం ఏంటంటే?
చంద్రయాన్ 3 లాంచ్ ప్యాడ్ నిర్మించిన కార్మికులకు జీతాలు అందక కుటుంబ పోషణ భారమైపోతుందంటూ ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. గత 18 నెలలుగా జీతాలు అందడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. హెవీ ఇంజనీరింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ లాంచ్ ప్యాడ్ తో పాటు, ఫోల్డింగ్ ప్లాట్ ఫాం, స్లైడింగ్ డోర్లను తయారు చేసింది. అయితే దీని కోసం పనిచేసిన కార్మికులు పూట గడవని ధీన స్థితిలో ఉన్నారు. హెచ్ ఈసీలో పనిచేస్తున్న టెక్నీషియన్ దీపక్ కుమార్ ఉపరారియా జీతం అందక పోవడంతో కుటుంబాన్ని పోషించేందుకు దాదాపు నాలుగు లక్షల అప్పు చేశానిని, ఇక ఇప్పుడు అప్పు కూడా పుట్టడం లేదని అందువల్లనే టీ, ఇడ్లీలు అమ్మి దాంతో వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నానని తెలిపాడు.
అయితే జీతాలు అందకపోవడంపై కేంద్రం స్పందిస్తూ, హెవీ ఇంజనీరింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ అనేది చట్టం కింద ఏర్పడిన స్వతంత్రమైన సంస్థ. కాబట్టి ఉద్యోగుల జీతభత్యాలను సంస్థనే ఏర్పటు చేసుకోవాలని తెలిపింది. మరోవైపు సంస్థలో మెషీన్స్ పాతబడిపోయాయని, పరికరాలను రూపొందించడానికి అనువుగా లేవని, దీంతో ఆర్డర్లు తక్కువై ఆదాయం పడిపోయిందని కంపెనీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు.