భారతీయుల మనసు ఇప్పుడు గర్వంతో ఉప్పొంగుతోంది. చందమామ గుట్టు విప్పేందుకు నింగిలోకి దూసుకెళ్లిన మన చంద్రయాన్-3 అక్కడ విజయవంతంగా ల్యాండ్ అయింది. ఇప్పటిదాకా జాబిల్లిపై ఎవరూ వెళ్లని దారుల్లో వెళ్లి.. ఎవరూ చూడని ‘దక్షిణ’ జాడల్ని ప్రపంచానికి చూపింది భారత్. ఇవాళ సాయంత్రం 6.03 గంటలకు ల్యాండర్ చందమామ మీద దిగ్విజయంగా కాలుమోపి.. భారత వైజ్ఞానిక సత్తాను ప్రపంచ దేశాలకు ఘనంగా చాటిచెప్పింది. కాగా, నాలుగేళ్ల కింద ఆఖరి క్షణాల్లో చెదిరిన కలను ఎలాగైనా సాకారం చేసుకోవాలన్న పట్టుదలతో ఇస్రో జులై 14న చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీహరికోట చంద్రయాన్-3 ప్రయోగానికి వేదికగా నిలిచింది. ఇక్కడి నుంచి దూసుకెళ్లిన బాహుబలి రాకెట్ ఎల్వీఎం3-ఎం4 సక్సెస్‌ఫుల్‌గా భూకక్ష్యలోకి చేరింది. ఆ తర్వాతి రోజు దీని కక్ష్యను పెంచారు. 18 రోజుల వ్యవధిలో ఇలా దశలవారీగా ఐదుసార్లు కక్ష్యను పెంచారు. ఐదో భూకక్ష్య పూర్తయిన తర్వాత జాబిల్లి దిశగా ప్రయాణానికి గానూ ఆగస్టు 1వ తేదీన ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అనంతరం ఆగస్టు 5వ తేదీన విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. ఆ తర్వాత క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ చందమామకు మరింత చేరువ చేశారు.
ఆగస్టు 17న రాకెట్‌లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన ల్యాండర్ మాడ్యూల్.. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయింది. ఆ తర్వాత సొంతంగా చంద్రుడి కక్ష్యలో పరిభ్రమించింది. మొత్తానికి ఇవాళ సాయంత్రం అన్ని దశలను విజయవంతంగా ముగించుకొని చంద్రుడి మీద కాలుమోపింది. అంతరిక్ష రంగంలో ప్రబల శక్తులుగా పేరుగాంచిన అమెరికా, రష్యా, చైనాలకు కూడా సాటికాని రీతిలో దక్షిణ ధ్రువంలో వ్యోమనౌకను ల్యాండ్ చేసిన మొదటి దేశంగా భారత్ అవతరించింది. దీంతో దేశ ప్రజలు సంబురాల్లో మునిగిపోయారు. ఈ విజయాన్ని టీమిండియా ప్లేయర్లు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. ఐర్లాండ్ టూర్లో ఉన్న జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు.. చంద్రయాన్-3 సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
🎥 Witnessing History from Dublin! 🙌
The moment India’s Vikram Lander touched down successfully on the Moon’s South Pole 🚀#Chandrayaan3 | @isro | #TeamIndia https://t.co/uIA29Yls51 pic.twitter.com/OxgR1uK5uN
— BCCI (@BCCI) August 23, 2023