భారతదేశం మరో అరుదైన ఘనతను అందుకుంది. ప్రపంచ దేశాలు తన వైపు చూసేలా అపూర్వ విజయాన్ని సాధించింది. ఇస్రో సంస్థ అంచనాలు ఏమాత్రం తప్పలేదు. యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయింది. దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువంలో అడుగుపెట్టిన తొలి దేశంగా ఇండియా చరిత్ర సృష్టించింది. ఓటమి గెలుపునకు నాంది అనేలా.. చంద్రయాన్-2 వైఫల్యంతో మంచి పాఠాలే నేర్చుకుంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. అందుకే పకడ్బందీగా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా చంద్రయాన్-3ని తీర్చిదిద్దింది.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి చేపట్టిన ఎల్వీఎం3-ఎం4 భూకక్ష్యలోకి విజయవంతంగా చేరింది. దాదాపు 41 రోజుల ప్రయాణంలో అలసిపోని విక్రమ్ ల్యాండర్.. ఇస్రో సైంటిస్టుల అంచనాలను వమ్ము చేయలేదు. వాళ్లు ఊహించినట్లుగానే సాఫ్ట్ ల్యాండింగ్ దిశగా ప్రయాణించి జాబిల్లి మీద అడుగు మోపింది. బుధవారం సాయంత్రం 5.44 గంటల ప్రాంతంలో ల్యాండర్ మాడ్యూల్ నిర్దేశించిన ప్రాంతానికి చేరింది. ఇస్రో శాస్త్రవేత్తలు పంపించిన ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ కమాండ్‌ను అనుసరిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సాఫ్ట్ ల్యాండింగ్ మొదలుపెట్టింది.
ఎట్టకేలకు అన్ని దశలను పూర్తి చేసుకొని చంద్రుడి ఉపరితలానికి చేరుకుంది ల్యాండర్. జాబిల్లికి ఏడున్నర కిలోమీటర్ల ఎత్తు నుంచి తన దిశను మార్చుకుంది. ఆ తర్వాత దశల వారీగా ఎత్తును తగ్గించుకొని ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశంలో కాలుమోపింది. అమెరికా, చైనా, రష్యా లాంటి దేశాలకు సాధ్యం కాని రీతిలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3ని దింపి భారత్ చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా ఇస్రో తొలి ట్వీట్ చేసింది. ‘నా గమ్యానికి నేను చేరుకున్నా. మీరు కూడా’ అని చంద్రయాన్-3 అన్నట్లుగా ఇస్రో ట్విట్టర్లో పేర్కొంది. చంద్రయాన్-3 సక్సెస్‌ఫుల్‌గా జాబిల్లిపై సాఫ్ట్‌ల్యాండ్ అయిందని.. కంగ్రాట్స్ ఇండియా అని ఇస్రో తన ట్వీట్లో రాసుకొచ్చింది.
Chandrayaan-3 Mission:
‘India🇮🇳,
I reached my destination
and you too!’
: Chandrayaan-3Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3
— ISRO (@isro) August 23, 2023