iDreamPost
android-app
ios-app

పెళ్లి వేడుకల్లో సినిమా పాటలు ప్లే చేయడంపై కేంద్రం కీలక ప్రకటన!

  • Published Jul 27, 2023 | 4:01 PM Updated Updated Jul 27, 2023 | 4:01 PM
  • Published Jul 27, 2023 | 4:01 PMUpdated Jul 27, 2023 | 4:01 PM
పెళ్లి వేడుకల్లో సినిమా పాటలు ప్లే చేయడంపై కేంద్రం కీలక ప్రకటన!

పెళ్లి, ఇతర శుభకార్యాలతో పాటు.. ఆఖరికి చావు ఊరేగింపులో కూడా రకరకాల పాటలతో మోత మోగిస్తారు. ఇక ఈ మధ్య కాలంలో డీజే లేకుండా ఎక్కడా పెళ్లి వేడుక జరగడం లేదు. పాటల మోత లేకుండా ఏ ఊరేగింపు కార్యక్రమం జరగదు. అయితే తాజాగా ఓ ఆశ్చర్యకరమైన వార్త వెలుగు చేసింది. పెళ్లి బరాత్‌లు, ఇతర వేడుకల్లో సినిమా పాటలు ప్లే చేయడం కోసం కొన్ని సొసైటీలు రాయల్టీ వసూలు చేస్తున్నాయి. దాంతో ఈ విషయం కాస్త కేంద్రం దృష్టికి చేరింది. ఈ క్రమంలో దీనిపై సెంట్రల్‌ గవర్నమెంట్‌ కీలక ఆదేశాలు జారీ చేసింది. పెళ్లి బరాత్‌లు, ఇతర వేడుకల్లో సినిమా పాటలు ప్లే చేయడం కాపీ రైట్‌ ఉల్లంఘన కిందకు రాదని కేంద్రం స్పష్టం చేసింది.

ఈమధ్య కాలంలో కొన్ని సొసైటీలు.. వివాహాది శుభకార్యాల్లో సినిమా పాటలు ప్రదర్శించి కాపీ రైట్‌ ఉల్లంఘనకు పాల్పడ్డరంటూ కొందరిపై చర్యలు తీసుకున్నాయి. సెక్షన్‌ 52 స్ఫూర్తికి విరుద్దంగా.. సినిమా పాటలను ప్రదర్శించారని.. ఇందుకు గాను తమకు రాయల్టీ చెల్లించాలని ప్రజలను ఒత్తిడి చేశాయి. దాంతో ఈ అంశంపై ప్రజలు, ఇతర భాగ్యస్వాముల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ‍ప్రమోషన్‌, ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌(డీపీఐఐటీ) ఈ ఫిర్యాదులు ‍స్వీకరించింది. ఈ క్రమంలో కేంద్రం పెళ్లి వంటి వేడుకల్లో సినిమా పాటల ప్రదర్శనకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది.

సెక్షన్ 52 (1) (జడ్‌ఏ) ప్రకారం.. ప్రత్యేకంగా సాహిత్య, నాటక, సంగీత, ఏదైనా మతపరమైన వేడుక, అధికారిక వేడుకల్లో సినిమా పాటలను ప్లే చేయడం అనేది కాపీరైట్ ఉల్లంఘన పరిధిలోకి రాదు అని కేంద్రం స్పష్టం చేసింది. మతపరమైన వేడుకలతో పాటు వివాహ ఊరేగింపు, ఇతర సామాజిక ఉత్సవాలు ఈ సెక్షన్‌ పరిధిలోకి వస్తాయి అంది. వీటిని దృష్టిలో ఉంచుకుని.. సెక్షన్ 52 (1) (జడ్‌ఏ)కి విరుద్ధంగా ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా కాపీరైట్ సొసైటీలకు ఆదేశాలు జారీ చేశాం అని డీపీఐఐఐటీ తెలిపింది. ఈ సెక్షన్‌ కింద ఏ వ్యక్తి, సంస్థ, కాపీరైట్‌ సొసైటీ నుంచి వచ్చే డిమాండ్లను అంగీకరించడం, డబ్బులు చెల్లించడం వంటివి చేయవద్దని ప్రజలకు సూచించింది. కేంద్రం నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

కాపీరైట్‌ చట్టం ఏం చేబుతోంది..

కాపీరైట్ చట్టం ప్రకారం ఒక రచనను మళ్లీ.. రీక్రియేట్‌ చేయడానికి, దాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించడానికి, అనువాదం చేయడానికి, సంబంధించి యజమానికి మాత్రమే హక్కులన్నీ ఉండేలా కాపీరైట్ చట్టం రక్షణ కల్పిస్తుంది. దీని ద్వారా యజమానులు వారి కష్టార్జితం అయిన పనిని, క్రియేటివిటీని.. ఎవరి ద్వారా దుర్వినియోగం కాకుండా కాపాడుకోవచ్చు. ఉల్లంఘన జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. అంతేకాక ఆ పని ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని పొందే హక్కు కేవలం యజమానికి మాత్రమే ఉంటుంది.

అయితే ఈ కాపీరైట్ రక్షణను కేవలం పరిమిత కాలానికి మాత్రమే అనుమతి ఇస్తారు. సాధారణంగా సదరు యజమాని, హక్కుదారు వారు జీవించి ఉన్నన్ని రోజులు తమ పని మీద సర్వ హక్కులు కలిగి ఉంటారు. అంతేకాక వారు మరణించిన తర్వాత కూడా మరో 60 ఏళ్ల వరకు ఆ పనిపై దాని సొంత యజమానికే కాపీరైట్ ఉంటుంది. యజమాని చనిపోయిన తర్వాత కూడా 60 ఏళ్ల పాటు.. వారసులు ఈ హక్కు కలిగి ఉంటారు.