iDreamPost
android-app
ios-app

అయోధ్య రామాలయం కోసం ఏకంగా 400 కిలోల తాళం తయారు చేసిన భక్తుడు!

  • Author singhj Published - 04:35 PM, Mon - 7 August 23
  • Author singhj Published - 04:35 PM, Mon - 7 August 23
అయోధ్య రామాలయం కోసం ఏకంగా 400 కిలోల తాళం తయారు చేసిన భక్తుడు!

అయోధ్య రామమందిర నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కోట్లాది మంది కొలిచే శ్రీ రాముడి ఆలయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది జనవరిలో భవ్య రామమందిరాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే దేవాలయ నిర్మాణానికి సంబంధించిన ఫొటోలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రిలీజ్ చేసింది. అయోధ్య రామమందిరానికి సంబంధించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. రామాలయం కోసం ఉత్తర్ ప్రదేశ్​కు చెందిన ఒక భక్తుడు ఏకంగా 400 కిలోల బరువైన తాళాన్ని తయారు చేశాడు.

తాళాల తయారీకి ప్రసిద్ధి గాంచిన యూపీలోని అలీగఢ్​ నగరానికి చెందిన సత్యప్రకాశ్ శర్మ అనే నిపుణుడు ఈ తాళాన్ని తయారు చేశారు. పరమ రామభక్తుడైన సత్యప్రకాశ్.. తాళాలను రూపొందించడంలో మంచి నైపుణ్యం కలిగిన వాడిగా పేరు పొందారు. ఆయన కుటుంబం 100 ఏళ్లకు పైగా తాళాల తయారీ పనులు చేస్తూ వస్తోంది. అయోధ్య భవ్య రామమందిర తాళం తయారీ కోసం సత్యప్రకాశ్ కొన్ని నెలలపాటు శ్రమించారు. ప్రపంచంలోనే అతిపెద్ద తాళాన్ని తన చేతులతో సిద్ధం చేశారు. దీన్ని అతి త్వరలో ఆయన ఆలయానికి అందజేయనున్నారు.

రామాలయాన్ని దృష్టిలో ఉంచుకొని 10 అడుగుల ఎత్తు, 4.5 అడగుల వెడల్పు, 9.5 అడుగుల మందంతో తాళాన్ని తయారు చేశానని సత్యప్రకాశ్ శర్మ చెప్పారు. నాలుగు అడుగుల చెవి ఉన్న ఈ అరుదైన తాళాన్ని ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన అలీగఢ్​ వార్షిక తాళాల ప్రదర్శనలో ఉంచారు. ఈ అతిపెద్ద తాళానికి ప్రస్తుతం చిన్న చిన్న మార్పులు, వివిధ రకాల అలంకరణలు చేస్తున్నారు. దీన్ని రూపొందించడంలో తన భార్య రుక్మిణి ఎంతగానో సహకరించారని, తయారీకి రూ.2 లక్షలు వెచ్చించినట్లు శర్మ తెలిపారు. దీనిపై శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీనియర్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా స్పందించారు. తాళాన్ని తీసుకోవాలా.. వద్దా? అనేది ఇతరులతో చర్చించాక నిర్ణయిస్తామని తెలిపారు.