ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన అంశాల్లో మణిపూర్ ఒకటి. ఈ ఈశాన్య రాష్ట్రంలో గత మూడు నెలలుగా అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. రీసెంట్గా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, అందులో ఒక స్త్రీపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన అందర్నీ షాక్కు గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు ఎగసిపడ్డాయి. దీనికి కారణమైన వారిని శిక్షించాలంటూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా వాయిదా పడుతూ ఉన్నాయి.
మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. దీన్ని వెంటనే సుమోటోగా తీసుకొని, కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. బాధ్యులైన వారి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. మహిళలను నగ్నంగా ఊరేగించి, గ్యాంగ్ రేప్ చేసిన ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తాజాగా స్పందించారు. ఈ ఘటనపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల నగ్న ఊరేగింపు వీడియోను ఉద్దేశపూర్వకంగానే విడుదల చేశారని అన్నారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు షా.
మణిపూర్ ఘటనకు సంబంధించిన కుట్రను తేల్చాల్సి ఉందని అమిత్ షా చెప్పుకొచ్చారు. అక్కడ జరుగుతున్న హింసాత్మక ఘటనలు, మహిళల నగ్న ఊరేగింపు మీద సుప్రీంకోర్టుకు కేంద్ర హోంశాఖ నివేదించిన అఫిడవిట్లోని అంశాలను షా మీడియాకు తెలిపారు. ఆ రాష్ట్రంలో 1990 నుంచి కుకీ, మెయితీ తెగల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. మణిపూర్లో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు చాలా ఘటనలు జరిగాయని షా గుర్తుచేశారు. తాజాగా కుకీ మహిళపై జరిగిన అమానవీయ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఒక మైనర్ సహా ఆరుగుర్ని అరెస్ట్ చేశామన్నారు. వీడియో తీసిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామని.. అతడి మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అమిత్ షా పేర్కొన్నారు.
కేంద్ర సర్కారును ఇబ్బంది పెట్టేందుకే ఈ వీడియోను విడుదల చేశారని.. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అమిత్ షా ఆరోపించారు. ఈ కుట్రను తేల్చేందుకు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోందని తెలిపారు. మణిపూర్ ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని షా వ్యాఖ్యానించారు. 2022లో మయన్మార్లో జరిగిన పలు ఘటనలకు సంబంధించిన వీడియోలను కూడా నెట్టింట వైరల్ చేస్తున్నారని షా చెప్పుకొచ్చారు. దీనిపై మణిపూర్ రాష్ట్ర పోలీసులు ఎఫ్ఆర్ఐ కూడా నమోదు చేశారని ఆయన వెల్లడించారు. త్వరలోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు సాధారణ స్థితికి వస్తాయని అమిత్ షా తెలిపారు.