రూ.100 పెట్టి లాటరీ కొని.. రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు

ఆర్థిక ఇబ్బందులు ఎదురు అయినప్పుడల్లా.. ఓ లాటరీ తగిలితే బాగుణ్ణు అనిపించక మానదు ఆశావాది అయిన మధ్య తరగతి కుటుంబాల్లోని వారికి. ఆస్తి మూరేడు, ఆశ బారెడు ఉండటంతో ఇలాంటి కలలు కంటుంటారు. లాటరీ కొన్నా లక్ వరిస్తుందని చెప్పలేం. ఎప్పుడో, ఎవరినో, ఎప్పటికే లక్ష్మీదేవి వరించదు. కాగా, ఒకరిని వరించడమే కష్టం అనుకుంటే.. ఇద్దరు స్నేహితులు జాక్ పాట్ కొట్టేలా చేసింది లాటరీ. రాత్రికి రాత్రే వారిని కోటీశ్వరులను చేసింది. ఇంతకు ఆ స్నేహితులదీ ఎక్కడంటే పంజాబ్ లోని ఫాజిల్కా జిల్లా. జిల్లాలోని అబోహర్ టౌన్‌కు చెందిన రమేశ్, కుకీ స్నేహితులు. వీరిద్దరికీ లాటరీ కొనడమంటే ఇష్టం. గత కొన్నేళ్లుగా పార్టనర్ షిప్ లో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. చాలా సార్లు చిన్న చిన్న బహుమతులు గెలుచుకున్నారు.

ఈసారి ఏకంగా బంఫర్ బొనాంజా కొట్టేశారు. ఈ సారి పార్టనర్ షిప్‌లో భాగంగా రూ. 100 పెట్టి లాటరీ టికెట్ కొనగా.. కోటిన్నర రూపాయలు వచ్చాయి. ఆదివారం ఈ ఫలితాలు వెల్లడి కాగా, ఈ భారీ ప్రైజ్ మనీని ఈ ఇద్దరు స్నేహితులు సొంతం చేసుకున్నారు. దీంతో ఒక్క రోజులోనే కోటీశ్వరులు అయిపోయారు. దీంతో పొద్దున్నే ఘంటాఘర్ చౌరస్తాలోని జాన్ చంద్ లాటరీ విక్రయ కేంద్రం వద్దకు భారీ బ్యాండుతో కోలాహలంగా డ్యాన్స్ చేసుకుంటూ వచ్చారు. నిర్వాహకులు డబ్బు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ లాటరీని డబ్బును తమ పిల్లల కోసం, కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తామని తెలిపారు ఈ ఇద్దరు స్నేహితులు రమేశ్, కుకీ.

Show comments