iDreamPost
android-app
ios-app

పార్లమెంట్ ప్రాంగణంలో ఆప్ ఎంపీపై కాకి దాడి.. బీజేపీ సెటైర్లు!

  • Author singhj Published - 04:59 PM, Wed - 26 July 23
  • Author singhj Published - 04:59 PM, Wed - 26 July 23
పార్లమెంట్ ప్రాంగణంలో ఆప్ ఎంపీపై కాకి దాడి.. బీజేపీ సెటైర్లు!

మన దేశంలో ఎన్నో విషయాల్లో సెంటిమెంట్లు పాటిస్తారు. అనేక విషయాల్లో నమ్మకాలను పాటించడం చూస్తూనే ఉంటాం. అయితే నమ్మకాల వరకు ఉంటే ఓకే.. కానీ అతి నమ్మకం, మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు మాత్రం ప్రమాదకరమనే చెప్పాలి. నమ్మకాల విషయానికొస్తే.. ఫలానా రంగు బట్టలు వేసుకోకూడదు, ఫలానా సమయానికే ఈ పని చేయాలి లాంటివి వినే ఉంటారు. బయటికి వెళ్లేటప్పుడు ఎవరైనా తుమ్మితే కొంతమంది వెళ్లడమే ఆపేస్తారు. మరికొందరు కాసేపు ఆగి కూర్చొని నీళ్లు తాగి బయల్దేరుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాలు, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను బట్టి ప్రజల విశ్వాసాలు, నమ్మకాలు ఆధారపడి ఉంటాయి.

కొన్ని నమ్మకాల్లో శాస్త్రీయత కూడా ఉండటాన్ని గమనించొచ్చు. అయితే మరికొన్ని మాత్రం చాలా సిల్లీగా అనిపిస్తాయి. కొంత మంది శకునాల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఎటైనా వెళ్లేటప్పుడు, ఏదైనా పని ఆరంభించినప్పుడు కాస్త తేడాగా అనిపించినా, ఏదైనా చెడు జరిగినా దాన్ని దుశ్శకునంగా భావిస్తారు. అలాంటి వాటిల్లో ఒకటి కాకి తల మీద తన్నడం లేదా వాలడం. కాకి ఎవరి తల మీదైనా వాలినా, తన్నినా, రెక్కలాడిస్తూ ఎగిరిపోయినా అస్సలు మంచి శకునం కాదని కొందరు నమ్ముతారు. అలాంటి ఒక ఘటనే పార్లమెంట్​ ఆవరణలో తాజాగా చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను కాకి తన్నింది.

పార్లమెంట్ ప్రాంగణంలో నిల్చొని తన ఫోన్ తీస్తుండగా ఒక కాకి రాఘవ్ చద్దా తల మీద తన్ని వెళ్లిపోయింది. ఈ అనూహ్య పరిణామానికి ఆయన కంగారుపడ్డారు. చద్దా తలపై కాకి తన్నిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అయితే, ఈ ఘటన మీద బీజేపీ నేతలు స్పందిస్తూ చద్దాను విమర్శిస్తున్నారు. బీజేపీ ఢిల్లీ యూనిట్ ఈ ఫొటోను ట్విట్టర్​లో పోస్ట్ చేస్తూ.. అబద్ధాలు ఆడితే కాకి పొడుస్తుందనే సామెత ఉందని తెలిపింది. అయితే ఈ సామెతను ఇప్పటిదాకా అందరమూ విన్నామని.. కానీ ఈ రోజు కళ్లారా చూస్తున్నామంటూ చద్దాపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. మరికొందరేమో ఈ ఫొటోను షేర్ చేస్తూ చద్దాకు కాబోయే భార్య, హీరోయిన్ పరిణీతి చోప్రాను ట్యాగ్ చేస్తున్నారు.