కొత్తగా 132 సీట్ల బస్సులు.. తగ్గనున్న టికెట్ ధరలు.. నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు

132 Seats Buses: పెరిగిపోతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ బస్సులతో టికెట్ ధరలు భారీగా తగ్గుతాయని నితిన్ గడ్కరీ వెల్లడించారు.

132 Seats Buses: పెరిగిపోతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ బస్సులతో టికెట్ ధరలు భారీగా తగ్గుతాయని నితిన్ గడ్కరీ వెల్లడించారు.

ప్రతి ఒక్కరికీ సొంత వాహనాలు ఉండడం వల్ల రోజరోజుకూ కాలుష్యం పెరిగిపోతుంది. 10, 20 సొంత వాహనాలు వాడేవారు ఒకే బస్సులో వెళ్తే ఎంత కాలుష్యం తగ్గుతుంది. అలానే ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్ని బస్సులు ఉన్నాయా అంటే లేవు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాలుష్యాన్ని అరికట్టడం కోసం ప్రభుత్వం ఒక పైలట్ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టిందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 132 సీట్ల బస్సు గురించి చెప్పుకొచ్చారు. విమానంలో సీట్లు, ఎయిర్ హోస్టెస్ ఉన్నట్లే ఈ బస్సుల్లో కూడా సీట్లు, బస్ హోస్టెస్ ఉంటారని వెల్లడించారు.

ఇంధన వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నామని.. ఇంధన దిగుమతి దేశంగా కాకుండా ఎగుమతి దేశంగా భారత్ ని మార్చాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని గడ్కరీ అన్నారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడం కోసం పలు కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను, ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలను తీసుకొస్తున్నాయని.. ఇథనాల్ ద్వారా నడిచే వాహనాలు మరింత ఎక్కువగా అందుబాటులోకి రానున్నాయని అన్నారు. అందుకోసం ప్రత్యేకంగా 300 ఇథనాల్ పంపుల ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ఇక ప్రజా రవాణా ఖర్చును కూడా తగ్గించడానికి ప్రభుత్వం ఇతర మార్గాలను అన్వేషిస్తుందని అన్నారు.

ఒక కి.మీ. ప్రయాణానికి డీజిల్ బస్సుకి 115 రూపాయల ఖర్చు అవుతుందని.. అదే ఏసీ ఎలక్ట్రిక్ బస్సుకి రూ. 41, నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సుకి 37 రూపాయలు అవుతుందని అన్నారు. నిర్వహణ ఖర్చు తగ్గినప్పుడు టికెట్ ధరలు కూడా తగ్గుతాయని నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇందుకోసం ప్రస్తుతం టాటాతో కలిసి నాగ్ పూర్ లో పైలట్ ప్రాజెక్టుని చేస్తున్నామని అన్నారు. యూరప్ లోని చెక్ రిపబ్లిక్ లో ఉన్న మూడు ట్రాలీల బస్సుని చూసిన నితిన్ గడ్కరీ.. అలాంటి బస్సులనే భారత్ లో కూడా ఉంటే బాగుణ్ణు అని అనుకున్నానని అన్నారు. రాబోయే ఎలక్ట్రిక్ బస్సు 132 మంది ట్రావెల్ చేసే విధంగా ఉంటుందని అన్నారు. 40 సెకన్లలో 40 కి.మీ. ప్రయాణించడానికి కావాల్సిన ఛార్జింగ్ వేసుకుంటుందని.. దీని కోసం 35 రూపాయల నుంచి 40 రూపాయలు ఖర్చు అవుతుందని అన్నారు. అదే జరిగితే టికెట్ ధరలు తగ్గుతాయి. అలానే ఎక్కువ మంది ప్రయాణిస్తారు కాబట్టి కాలుష్యం కూడా తగ్గుతుంది.

Show comments