Tirupathi Rao
Young Heroes From Tollywood: టాలీవుడ్ లో కుర్ర హీరోలు చకాచకా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఒకరకంగా సీనియర్లకే పోటీగా మారుతున్నారు.
Young Heroes From Tollywood: టాలీవుడ్ లో కుర్ర హీరోలు చకాచకా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఒకరకంగా సీనియర్లకే పోటీగా మారుతున్నారు.
Tirupathi Rao
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకు మొదటి నుంచి ఎలాంటి పోటీ ఉండేది కాదు. వారి డేట్స్ కోసం, వారికి కథలు చెప్పేందుకు డైరెక్టర్లు ఎదురుచూస్తూ ఉండేవాళ్లు. సీనియర్ హీరోలతో ఓకే చెప్పించుకోవడానికి టాప్ నిర్మాతలు కూడా ముప్పతిప్పలు పడేవాళ్లు. అలా సీనియర్ హీరోలు అందరూ ఒక సంవత్సరంలోనే నాలుగైదు సినిమాలు తీసినా ఆశ్చర్యపోయేవాళ్లు కాదు. కానీ, రానురాను తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరో మెటీరియల్ రావడం ఎక్కువైంది. ఇప్పుడు వారసత్వం, ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ వంటి పద్ధతులు పెద్దగా లేవనే చెప్పాలి. హార్డ్ వర్క్, టాలెంట్ ఉంటే ఎవరైనా సక్సెస్ కొట్టచ్చు, ఎవరికైనా అవకాశాలు దక్కుతాయని చూస్తూనే ఉన్నాం. నిజానికి ఇప్పుడు యంగ్ హీరోలే చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్నారు. సీనియర్లకు గట్టి పోటీ కూడా ఇస్తున్నారు.
టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు ఎప్పుడూ డిమాండ్ బాగా ఉంటుంది. ఇప్పుడంటే పరిస్థితులు మారిపోయాయి. గతంలో అయితే టాప్ హీరోలు ఏడాదిలో కనీసం మూడు సినిమాలు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు మూడేళ్లకు ఒక సినిమా వచ్చినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమయంలో యంగ్ హీరోలు మాత్రం పక్కా ప్రణాళికతో దూసుకుపోతున్నారు. ఒకానొక సమయంలో సీనియర్ల కంటే ఈ కుర్ర హీరోలే తోపులు అని నిరూపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలు ఒక ప్రాజెక్టు పూర్తయ్యే సరికి మరో ప్రాజెక్టుతో ముందుకొస్తున్నారు. ఇలాంటి పక్కా ప్రణాళికతో కెరీర్ ని బిల్డ్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ లో కష్టపడి, ఇష్టపడి హీరోలుగా ఎదిగిన కుర్రాళ్లు ఎవరైనా ఉన్నారు అంటే విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ, అడవి శేష్, విశ్వక్ సేన్, నవీన్ పోలిశెట్టి, సుహాస్ పేర్లను చెప్పచ్చు. వీళ్లు తమ కెరీర్ ని పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారు.
ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉంటున్నారు. వీళ్లంతా మినిమం గ్యారెంటీ హీరోలుగా ముద్ర వేసుకున్నారు. అందుకే బడా నిర్మాతలు సైతం వీరితో సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. మరోవైపు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లు కూడా ఇండస్ట్రీలో పుష్కలంగా ఉన్నారు. ఈ యంగ్ సరుకు మొత్తం వరుస ప్రాజాక్టులతో ఇండస్ట్రీని దున్నేస్తోంది. ఒకానొక సమయంలో సీనియర్ హీరోలకు కూడా ఛాన్సులు లేకుండా చేసేస్తున్నారు ఈ కుర్రాళ్లు. వీరిలో ముఖ్యంగా విశ్వక్ సేన్ చేతిలో మొత్తం 5 సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలు చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. గామి మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మరోసారి వాయిదా పడింది. ఇవి కాకుండా.. మెకానిక్ రాకీ, కల్ట్, లైల్ అనే మూడు సినిమాలు రెడీగా ఉన్నాయి. సిద్ధు జొన్నలగడ్డ కూడా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే టిల్లు స్క్వేర్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. నీరజా కోనతో తెలుసు కదా సినిమా, బొమ్మరిల్లు భాస్కర్ తో జాక్ మూవీస్ చేస్తున్నాడు.
తర్వాత అడవి శేష్ కూడా గూఢచారి 2, డెకాయిట్ ప్రాజెక్టులతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇవి మాత్రమే కాకుండా కొన్ని ప్రాజెక్టులు డిస్కషన్స్ లో ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా ఫ్యామిలీ స్టార్ తో ఎంటర్ టైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. తర్వాత వీడీ12 ప్రాజెక్టు కూడా రెడీగా ఉంది. నవీన్ పోలిశెట్టి మాత్రం కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అనగనగా ఒకరోజు ప్రాజెక్టుల మాత్రమే ఉంది. హ్యాట్రిక్ హీరో సుహాస్ అయితే అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. తర్వాత గొర్రె పురాణం ప్రాజెక్టుతో రాబోతున్నాడు. కలర్ ఫొటో డైరెక్టర్ సందీప్ రాజ్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు వెల్లడించాడు. ఈ ఏడాదే సెట్స్ మీదకు వస్తుందని చెప్పాడు. ఇలా కుర్రాళ్లు అంతా చకాచకా అడుగులు వేస్తూ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఒకరకంగా సీనియర్ హీరోలకు సవాలు విసురుతున్నట్లే అనిపిస్తోంది. మరి.. దూసుకుపోతున్న కుర్ర హీరోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.