ఓ భాషలో స్టార్ హోదా వచ్చాక.. వేరే భాషలలో ఎప్పుడెప్పుడు అవకాశాలు వస్తాయా? అని ఎదురు చూస్తుంటారు హీరోయిన్స్. ఎవరు ఏ భాషలో సక్సెస్ అయినా.. ఒకప్పుడు అందరు హీరోయిన్స్ ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే ఉండేది. కానీ.. అందరికీ అవకాశాలు కాదు.. టైమ్ కూడా కలిసి రావాలి. అయితే.. కన్నడ నుండి వచ్చి తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన భామ రష్మిక మందన. కన్నడ ‘కిరాక్ పార్టీ’ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. తెలుగులో ఛలో సినిమాతో అడుగుపెట్టింది. ఇంకేముంది.. ఫస్ట్ మూవీనే సూపర్ సక్సెస్ అయ్యేసరికి.. ఒక్కసారిగా తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి. అలా వరుసగా గీతగోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరూ, భీష్మా సినిమాలతో స్టార్డమ్ సొంతం చేసుకుంది.
కట్ చేస్తే.. ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప మూవీ ఛాన్స్. ఆ సినిమా రిలీజ్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా క్రేజ్. అలా ఒక్క సినిమాతో రష్మిక కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. పాన్ ఇండియా క్రేజ్ వచ్చాక.. వేరే భాషల నుండి అవకాశాలు రాకుండా ఉంటాయా.. అటు తమిళంతో పాటు బాలీవుడ్ లోను సినిమాలు ఓకే చేసింది. అది ఓ రకంగా మంచి విషయమే. ఎందుకంటే.. తెలుగు సినిమాలతో స్టార్ అయిన హీరోయిన్.. బాలీవుడ్ వరకు వెళ్తుందంటే విశేషమే అనుకోవాలి. కానీ.. బాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి కదా అని.. తనకు గుర్తింపు తెచ్చిన ఇండస్ట్రీలో సినిమాలు చేయకుండా ఉండటమే ఇక్కడ అసలు విషయం.
రష్మిక చివరిగా తెలుగులో సీతారామం, ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాలు చేసింది. ఆ తర్వాత కనీసం ఒక్క తెలుగు సినిమా కూడా ఓకే చేయకపోవడం గమనార్హం. మొన్నటివరకు నితిన్ తో ప్రాజెక్ట్ ఓకే అయ్యిందని అనుకుంటే.. అందులో నుండి తప్పుకుందని తెలుస్తుంది. అంటే.. టాలీవుడ్ లో రష్మిక కంటిన్యూ అవ్వాలని అనుకోట్లేదా? లేక గతంలో కొందరు హీరోయిన్స్ మాదిరి.. బాలీవుడ్ లో అవకాశాలు వచ్చే వరకే టాలీవుడ్ అన్నట్లు ఆలోచించిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య టాలీవుడ్ ఆఫర్స్ వచ్చినా.. ఆ క్యారెక్టర్ లో ఏదోకటి తక్కువ అయ్యిందంటూ రిజెక్ట్ చేస్తోందని ఇండస్ట్రీ టాక్. రెండు సినిమాలు ఆఫర్స్ వస్తే.. వాటిని కాదనేసిందట. మరి ఇదివరకు పాత వాళ్లు చేసిన తప్పునే రష్మిక చేస్తోందా అని అనుకుంటున్నారు. ప్రస్తుతం రష్మిక తెలుగులో పుష్ప 2 ఒకటే చేస్తోంది. మరి రష్మిక నుండి త్వరలో తెలుగు ప్రాజెక్ట్ అనౌన్స్ అవుతుందేమో చూడాలి.