iDreamPost
iDreamPost
ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్ లో దేశమంతా మాట్లాడుకుంటున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇతని నేపథ్యం ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో చూద్దాం. ప్రశాంత్ నీల్ ది కర్ణాటక రాష్ట్రంలోని హసన్ ప్రాంతం. 1980 జూన్ 4 పుట్టినరోజు. చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి రావాలన్న లక్ష్యం పెట్టుకోలేదు. డిగ్రీ అయ్యాక ఓ జాబ్ చేస్తుండగా ఇలా ఉంటే డబ్బు ఎక్కువ సంపాదించలేమని గుర్తించి ఇండస్ట్రీకి రావాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే రిజైన్ చేసి డైరెక్షన్ కోర్స్ చేశారు. నిజానికి ప్రశాంత్ అడుగుపెట్టే సమయానికి తెలుగు తమిళంతో పోలిస్తే శాండల్ వుడ్ మార్కెట్ చాలా చిన్నది.
కానీ ఈ లెక్కలేవి పట్టించుకోలేదు. అప్పటికే అప్ కమింగ్ స్టేజి లో ఉన్న బావమరిది శ్రీమురళిని హీరోగా ఊహించుకుని ఉగ్రం కథను రాసుకున్నారు. నిర్మాతలు దొరికారు. సినిమా పూర్తయ్యింది కానీ ఆర్థిక కారణాల వల్ల రిలీజ్ లేట్ అయ్యింది. అవుట్ ఫుట్ చూసిన స్టార్ హీరో దర్శన్ ఆర్థిక సహకారం అందించాక ఉగ్రం 2014లో బయటికి వచ్చింది. కన్నడ తెరకు కొత్త స్టైల్ ని నేర్పించిన ఉగ్రం చూసిన ప్రేక్షకులు ప్రశాంత్ టేకింగ్ కు ఫిదా అయిపోయారు. నెక్స్ట్ రాసుకున్న స్క్రిప్టే కెజిఎఫ్. చిన్నప్పటి నుంచి తనను బాగా ప్రభావితం చేసిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రతిపాదన సిద్ధం చేశారు.
అందరూ బాగుందన్నారు కానీ హోంబాలే ఫిలింస్ అధినేత విజయ్ కిర్లందూర్. ధైర్యం చేశారు యష్ ని హీరోగా ఫిక్స్ చేసుకున్నారు. దీని కోసమే వేరే సినిమాలు మానేసి గెడ్డం పెంచాడు యష్. స్థాయికి మించి కెజిఎఫ్ కు పెడుతున్న ఖర్చు చూసి ఇండస్ట్రీలో ఒకటే గుసగుసలు. ఓసారి ఎయిర్ పోర్ట్ లో రాజమౌళి ఎదురుపడితే ఆయన వెంటపడి మరీ యష్, ప్రశాంత్ నీల్ లు కెజిఎఫ్ రఫ్ కట్ చూపించారు. స్టన్ అయిన జక్కన్న వెంటనే సీక్వెల్ ఐడియా ఇచ్చి తెలుగు హక్కులకు సాయి కొర్రపాటిని రికమండ్ చేశారు. ప్రశాంత్ నీల్ విజన్ ని గొప్పగా అర్థం చేసుకున్న వాళ్ళలో రాజమౌళి ఒకరు. తర్వాత జరిగిన జరుగుతున్న జరగబోయే చరిత్ర మనం చూస్తున్నదే.