iDreamPost
iDreamPost
టాలీవుడ్ స్టార్ హీరోలలో వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడు తమన్ నామస్మరణే చేస్తున్నారు. సమకాలీకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ఉన్నప్పటికీ సుకుమార్ సినిమాలకు తప్ప ఒకప్పటి రేంజ్ మ్యూజిక్ ఇవ్వడం లేదన్న కంప్లయింట్ గత కొన్నేళ్లుగా దేవి గురించి నిజమవుతూనే ఉంది. అందుకే ఇప్పుడు అధిక శాతం ఓట్లు తమన్ కే పడుతున్నాయి. కారణం తనకున్న భీభత్సమైన ఫామ్. మూడు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మించిన రాధే శ్యామ్ కు బిజిఎం ఇవ్వడానికి ప్రత్యేకంగా తననే ఏరికోరి మరీ తీసుకోవడానికి కారణం ఇదే. అఖండ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దాని విజయంలో ఎంత కీలక పాత్ర పోషించిందో వేరే చెప్పాలా.
ఏ సంగీత దర్శకుడికైనా శుక్రమహర్దశ అనేది ఒకటొస్తుంది. దాన్ని ఎక్కువ కాలం నిలబెట్టుకోవడం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కెవి మహదేవన్, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, కీరవాణి, రాజ్ కోటి వీళ్ళు దశాబ్దాల తరబడి ఏలారంటే తమ సక్సెస్ ని కాపాడుకునేలా మంచి సంగీతాన్ని ఇవ్వడం ద్వారా. మణిశర్మ, దేవిశ్రీప్రసాద్ లు కూడా ఇలాంటి ఫామ్ ని ఎంజాయ్ చేశారు. ఇక్కడ చెప్పిన వాళ్ళందరి మేజిక్ ప్రస్తుతం మునుపటి స్థాయిలో లేదన్న మాట వాస్తవం. కానీ తమన్ కేసు వేరుగా ఉంది. బ్లాక్ బస్టర్స్ తమన్ ఇప్పుడు కొత్తగా ఇవ్వడం లేదు. 2009లో రవితేజ కిక్ నుంచే ఈ ప్రస్థానం మొదలయ్యింది. ఆపై బృందావనంతో ఇది కొనసాగింది.
ఇలా 2010 నుంచి మొదలుపెడితే మిరపకాయ్, కందిరీగ, దూకుడు, బిజినెస్ మెన్, నాయక్, బాద్షా, బలుపు, మసాలా, రేస్ గుర్రం, పవర్ ఇలా అందరు హీరోలతో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఎన్నో ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2020లో అల వైకుంఠపురములో నుంచి తమన్ కెరీర్ ఇంకో మలుపు తీసుకుంది. యుట్యూబ్ ని షేక్ చేసే పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో వేసిన ముద్ర బలంగా పడింది. క్రాక్, వకీల్ సాబ్, భీమ్లా నాయక్, డీజే టిల్లు విజయంలో తమన్ భాగమెంతంటే చెప్పడం కష్టం. రాబోయే గని, సర్కారు వారి పాట, గాడ్ ఫాదర్, ఆర్సి 15, థాంక్ యు లాంటి క్రేజీ ప్రాజెక్టులన్నీ తమన్ ఖాతాలోనే ఉన్నాయి.
Also Read : Venkatesh :విక్టరీ వద్దనుకున్న ఆడవాళ్లు వీళ్లేనా