టాలీవుడ్ రేంజ్ రోజురోజుకు విస్తరిస్తోంది. నిన్నమెున్నటి దాక ఇండియా వరకే పరిమితమైన తెలుగు సినిమాలు.. కొంత కాలం నుంచి వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతూ.. రికార్డులు నెలకొల్పుతున్నాయి. గతంలో ఒక సినిమా రూ. 100 కోట్లు సాధిస్తేనే గొప్ప అనుకున్న రోజుల నుండి.. ఇప్పుడు రూ.1000 కోట్లకు చేరుకుంది. తాజాగా హాలీవుడ్ ను ఢీ కొనబోతోంది. ఈ క్రమంలోనే ప్రముఖు దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రాజెక్-కె మేకింగ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాజెక్ట్ కె షూటింగ్ సెట్ కు వెళ్లిన ఆయన.. మేకింగ్ చూసి.. ప్రాజెక్ట్ కె తొలి రోజే రూ.500 కోట్లు కొల్లగొడుతుందని అభిప్రాయ పడ్డారు.
ప్రాజెక్ట్ కె.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్న భారీ చిత్రం. భారీ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటోంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రాజెక్ట్ కె సెట్ కు రెండు మూడు సార్లు వెళ్లొచ్చారు. సినిమా మేకింగ్ చూసి ఆశ్చర్యానికి లోనైయ్యారు తమ్మారెడ్డి. తాజాగా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ అయిన ఐ డ్రీమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రాజెక్ట్ కె గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి మాట్లాడుతూ..
”ప్రాజెక్ట్ కె గ్లోబల్ సినిమా. దీన్ని సరిగ్గా ప్రొజెక్ట్ చేయగలిగితే.. వరల్డ్ టాప్-50 కలెక్షన్స్ చిత్రాల జాబితాలో ఉంటుంది. ప్రస్తుతం రూ.వెయ్యి కోట్లు అనే మాటను దాటేశాం. భవిష్యత్ లో మాట్లాడుకోవాల్సింది రూ.10 వేలు, రూ.20 వేల కోట్ల గురించే. ఇప్పుడు తెలుగు చిత్రాలు హాలీవుడ్ మూవీలతో పోటీ పడుతున్నాయి. ఇక ప్రాజెక్ట్ కె ప్రచారం పక్కా ప్లానింగ్ ప్రకారం చేస్తే.. తొలి రోజే రూ.500 కోట్లు కొల్లగొడుతుంది. ఎందుకంటే ప్రభాస్ రేంజ్ అలాంటిందని” తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు. గతంలో రూ.25, 30 కోట్లు వస్తేనే గొప్ప అనుకున్నామన్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాలు ఈజీగా వంద కోట్లు దాటేస్తున్నాయని, బాహుబలి విడుదల అయ్యాక వంద కాదు.. రూ. వెయ్యి కోట్లు కూడా కొల్లగొట్టోచ్చు అని నిరూపించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆదిపురుష్ తో అభిమానులను నిరాశ పరిచిన డార్లింగ్.. ప్రాజెక్ట్ కె తోనైనా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేస్తాడో? లేదో? తెలియలి అంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.