iDreamPost
android-app
ios-app

Suzhal: The Vortex Review సుడల్ వెబ్ సిరీస్ రిపోర్ట్

  • Published Jun 18, 2022 | 2:54 PM Updated Updated Jun 18, 2022 | 2:57 PM
Suzhal: The Vortex Review సుడల్ వెబ్ సిరీస్ రిపోర్ట్

ఏదో ప్యాన్ ఇండియా సినిమాని స్ట్రీమింగ్ చేస్తున్నంత పబ్లిసిటీ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్ కొత్త వెబ్ సిరీస్ సుడల్. భారీగా ప్రమోషన్ చేయడంతో పాటు అధిక భాషల్లో డబ్బింగ్ ఇవ్వడంతో ఎక్కువ శాతం ప్రేక్షకులు చూసే అవకాశం దక్కింది. అయిదేళ్ల క్రితం తమిళంలో వచ్చి ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతున్న విక్రమ్ వేద దర్శక ద్వయం పుష్కర్ గాయత్రిలు దీనికి రచన చేశారు.ఎనిమిది ఎపిసోడ్లకు బ్రహ్మ అనుచరణ్ లు జంటగా దర్శకత్వం వహించారు. ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రగా హై లైట్ అవ్వగా పార్తీబన్, కథిర్, శ్రేయా రెడ్డి, హరీష్ ఉత్తమన్ తదితరులు ఇతర తారాగణం. ఇన్ని అంచనాలతో వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం.

తమిళనాడులోని నంబలూరు కొండప్రాంతాలు ఎక్కువగా ఉండే ఒక చిన్న సైజు పట్టణం. 1990లో స్థాపించిన సిమెంట్ ఫ్యాక్టరీని నమ్ముకుని అక్కడ వేలాది కుటుంబాలు జీవిస్తుంటాయి. ఓ రాత్రి ఉన్నట్టుండి ఆ కర్మాగారం మొత్తం మంటల్లో తగలబడి పోతుంది. యూనియన్ లీడర్ షణ్ముగం(పార్తీబన్) చిన్న కూతురు నీల, స్థానిక పోలీస్ అధికారి రెజీనా(శ్రేయ రెడ్డి)కొడుకు ఇద్దరు కనిపించకుండా పోతారు. దీంతో ఆమెను వెతకడం కోసం కోయంబత్తూర్ లో ఉండే నీల అక్క నందిని(ఐశ్వర్య రాజేష్)ఇంటికి వచ్చేస్తుంది. ఇన్స్ పెక్టర్ (కథిర్)సహాయంతో వేట మొదలుపెడుతుంది. షాకింగ్ అనిపించే ఎన్నో వాస్తవాలు బయటపడతాయి. అదే అసలైన కథ.

మొత్తం ఆరున్నర గంటలకు పైగా సాగే ఈ వెబ్ సిరీస్ లో కథ మరీ కొత్తగా అనిపించనప్పటికీ స్క్రీన్ ప్లే, టేకింగ్ తో విసుగు రాకుండా మేనేజ్ చేశారు. క్యాస్టింగ్ విషయంలో రాజీ పడకుండా బాగా సెట్ చేసుకున్నారు. ముఖ్యంగా విశాల్ పొగరులో విలన్ గా నటించి చాలా గ్యాప్ తర్వాత కం బ్యాక్ ఇచ్చిన శ్రేయరెడ్డి, పార్తీబన్ ల పోటాపోటీ నటన ఆకట్టుకుంది. విజువల్స్, ఆర్ట్ వర్క్ చాలా బాగా వచ్చాయి. మధ్యలో ల్యాగ్ ఉన్నప్పటికీ కాస్త ఫార్వార్డ్ చేసుకుని ఈజీగా పూర్తి చేసేయొచ్చు. అసలు హంతకుడికి సంబంధించిన ట్విస్ట్ గొప్పగా అనిపించకపోవడం చిన్న లోపం. ఫైనల్ గా ఈ జానర్ ని ఇష్టపడే వాళ్ళను సడల్ మెప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.