ఈ టెక్ యుగంలో మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. ఒకప్పుడు పురుషులతో పోటీపడిన స్త్రీలు.. ఇప్పుడు వారిని అధిగమిస్తూ సత్తా చాటుతున్నారు. ఐటీ, ఫార్మా, బిజినెస్.. ఇలా ఏ సెక్టార్లో తీసుకున్నా మహిళలు సంచలనాలు సృష్టిస్తున్నారు. సినీ, క్రీడా రంగాల్లోనూ తాము ఎవరికీ తీసిపోమని నిరూపిస్తున్నారు. ఇందుకు పేరెంట్స్‌ను మెచ్చుకోవాల్సిందే. చదువుకుంటేనే భవిష్యత్ అనే విషయాన్ని అర్థం చేసుకొని.. వారికి నచ్చిన రంగాల్లో వెళ్లేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తుండటం శుభపరిణామం. అయితే ఇప్పటికీ కొన్ని రంగాల్లోకి వెళ్లేందుకు పేరెంట్స్ ఒప్పుకోరు. అందులో ఒకటి సినీ రంగం అని విశ్లేషకులు అంటున్నారు.
గ్లామర్ ఫీల్డ్‌లో తమ పిల్లల్ని.. ముఖ్యంగా ఆడపిల్లల్ని పంపేందుకు చాలా మంది పేరెంట్స్ ఇంట్రస్ట్ చూపించరు. కానీ ఈ పరిస్థితుల్లో క్రమంగా మార్పులు వస్తున్నాయి. సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చి నటులుగా, దర్శకులుగా, నిర్మాతలుగా రాణిస్తున్న మహిళల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. అయితే మిగతా ఇండస్ట్రీల్లాగే ఇక్కడ కూడా కొందరు స్త్రీలు వివక్షను, వేధింపులను ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. అందుకే అప్పట్లో ‘మీ టూ’ ఉద్యమం సెగలు చిత్ర పరిశ్రమకూ తాకాయి. అయితే కొంతకాలం తర్వాత ఆ ఊసే లేకుండా పోయింది. ఇదిలా ఉంటే.. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానని ప్రముఖ గాయని, చిత్రకారిణి, నటి సుచిత్రా కృష్ణమూర్తి చెప్పారు. కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తున్న సుచిత్రా కృష్ణమూర్తి ఫిల్మ్ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వెల్లడించారు.
‘ఆ రోజుల్లో ఆడిషన్స్ అన్నీ హోటల్స్‌లోనే జరిగేవి. అలా నేను ఓ దర్శకుడ్ని హోటల్లో కలిశాను. ఆయన.. మీ అమ్మానాన్నల్లో ఎవరితో ఎక్కువ చనువుగా ఉంటావ్? అని అడిగారు. మా నాన్నతోనే అని నేను చెప్పా. అయితే, మీ నాన్నకు ఫోన్ చేసి రేపు పొద్దున నిన్ను ఇంటి దగ్గర దింపుతానని చెప్పమన్నారు. ఆ డైరెక్టర్ చెప్పిన మాటలు విని షాకయ్యాను. తొలుత ఆయనేం చెబుతున్నారో నాకు అర్థం కాలేదు. కానీ ఆయన మాటల వెనుక మర్మం అర్థమై నా కాళ్లు, చేతులు వణికిపోయాయి, దుఃఖం పొంగుకొచ్చింది. వెంటనే బ్యాగ్ తీసుకొని మళ్లీ వస్తానని చెప్పి.. అక్కడి నుంచి పరుగులు తీశా. ఇలా నా కెరీర్లో చాలాసార్లు జరిగింది. పరిశ్రమలో ఇంతకంటే దారుణమైన ఘటనలను చాలా మంది ఎదుర్కొన్నారు’ అని సుచిత్రా కృష్ణమూర్తి చెప్పుకొచ్చారు.