iDreamPost
iDreamPost
చిన్న పొజిషన్ తో అప్ కమింగ్ స్టేజిలో ఉన్న హీరోకు పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత రిలీజయ్యే సినిమాల మీద అంచనాల పరంగా ఎంత ఒత్తిడి ఉంటుందో తెలిసిందే. కాకపోతే దానికన్నా ముందు ఒప్పుకున్న వాటిలో పెరిగిన ఇమేజ్ కు తగ్గట్టు క్యారెక్టర్ లేకపోతే అనవసరమైన ఇబ్బందులు వస్తాయి. ఇది దాదాపు అందరికీ అనుభవమే. అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ విడుదల కాని పాత సినిమాను తవ్వి తీసి మార్కెట్ చేసుకునే ప్రయత్నం చేసిన నిర్మాత ఉన్నారు. ఇప్పుడే కాదు ఖైదీ టైంలో దాని వల్ల వచ్చిన ఇమేజ్ కు మ్యాచ్ కాలేక మంత్రి గారి వియ్యంకుడు లాంటి ఫీల్ గుడ్ మూవీస్ అంచనాలు అందుకోలేకపోయాయి.
ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ వంతు వచ్చింది. డీజే టిల్లు అనూహ్య విజయం అతని మార్కెట్ ని అమాంతం పెంచేసింది. బడ్జెట్ లు ఎక్కువ పెట్టేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అయితే దీనికన్నా ముందు సిద్ధూ కప్పేలా మలయాళం రీమేక్ లో నటించేందుకు ఒప్పుకున్నాడు. చాలా ముఖ్యమైన పాత్రే కానీ సోలో హీరోగా చెప్పలేని సబ్జెక్టు ఇది. పైగా డీజే టిల్లు టైంలోనే నిర్మాతలు సితార ఎంటర్ టైన్మెంట్ దీన్ని చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు సిద్దు ఇది చేస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని ఆలోచిస్తున్నాడట. పదేళ్ల తర్వాత దొరికిన పెద్ద బ్రేక్ ని వృధా చేసుకోవడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు.
సితార అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ వీలైనంత త్వరగా డీజే టిల్లు 2కి రంగం సిద్ధం చేస్తున్నారట. మరి కప్పేలా రీమేక్ ఆగిందా లేక క్యాన్సిల్ చేశారా లోగుట్టు పెరుమాళ్ళకెరుక. దీనికి చంద్రశేఖర్ టి రమేష్ ని దర్శకుడిగా తీసుకున్నారు. దీని తాలూకు అప్డేట్స్ కూడా నెలల తరబడి రావడం లేదు. మరి హోల్డ్ లో ఉంచారా లేక ఆపేశారా అనేది తెలియాల్సి ఉంది. అసలే జనాలు భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలు ఓటిటిలో చూస్తున్నారు. అలాంటిది కప్పేలా లాంటివి వీలైనంత ఆలస్యం చేయకుండా ఫినిష్ చేయడం చాలా అవసరం. మరి ఈ క్లారిటీ ఇవ్వాల్సింది సిద్దు జొన్నలగడ్డే