iDreamPost
iDreamPost
సౌత్ సినిమా డామినేషన్ తో కకావికలమవుతున్న బాలీవుడ్ కు భారీ సినిమాలు బొత్తిగా కలిసి రావడం లేదు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లాంటివి తామూ తీయాలనే తాపత్రయంతో బొత్తిగా కథా కథనాలు చూసుకోకుండా వందల కోట్ల బడ్జెట్లు పెట్టి గ్రాండియర్లు తీస్తున్నారు. యష్ రాజ్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ సైతం ఈ ట్రాప్ లో పడి డిజాస్టర్లు కొని తెచ్చుకోవడం గమనార్హం. ఆ మధ్య సామ్రాట్ పృథ్విరాజ్ ఎంత దారుణంగా దెబ్బేసిందో బాక్సాఫీస్ ఇంకా మర్చిపోలేదు. ఈలోగా మరొకటి వచ్చి పడింది. అదే షంషేరా. నిన్న హిందీతో పాటు తెలుగు తమిళం కన్నడ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేశారు.
ముందు కథేంటో చూద్దాం. బ్రిటిష్ పాలనలో వివక్షకు గురై బానిస బ్రతుకులు వెళ్లదీస్తున్న ఖామెరాన్ జాతీయులు బ్రతుకు తెరువు కోసం దొంగలుగా మరి అగ్రవర్ణాల సంపదను దోచుకోవడం మొదలుపెడతారు. వీళ్ళ నాయకుడు షంషేరా(రన్బీర్ కపూర్) తన వాళ్ళ కోసం బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపేందుకు సిద్ధపడతాడు. ఖమెరాన్లు బాగుండాలన్న లక్ష్యం వైపు పోరాడుతున్న షంషేరా ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోతాడు. కొన్నేళ్ల తర్వాత ఇతని కొడుకు మల్ల(రన్బీర్ కపూర్)వచ్చి ఆ బాధ్యతను తీసుకుంటాడు. తండ్రి కోరుకున్నది ఎలా సాధించాడు. ఇతనికి శుద్ సింగ్(సంజయ్ దత్)కి ఉన్న శత్రుత్వం ఏంటి అనేది వెండితెర మీద చూసి తరించాలి.
రన్బీర్ కపూర్ నటన ఒక్కటే షంషేరాలో చెప్పుకోవాల్సిన పాజిటివ్ అంశం. బాహుబలిని తిప్పి రాసుకుని నానా ఖంగాళీ కథా కథనాలతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాడు దర్శకుడు కరణ్ మల్హోత్రా. అద్భుతమైన విజువల్స్, కోట్ల రూపాయల ఖర్చు మొత్తం నాసిరకం రైటింగ్ వల్ల వృథా అయ్యాయి. అప్పుడెప్పడో వచ్సిన ఎపిక్ డిజాస్టర్ థగ్స్ అఫ్ హిందుస్థాన్ ని మించిపోయేలా ఉందీ కళాఖండం. సంజయ్ దత్ క్యారెక్టర్ విపరీతంగా చికాకు పుట్టిస్తుంది. మిథూన్ సంగీతం కూడా ఏమంత ఉపయోగపడలేదు. అసలు ఇందులో ఏముందని యష్ అధినేతలు ఈ స్క్రిప్ట్ ని ఓకే చేశారో అర్థం కాదు. కేవలం రన్బీర్ కపూర్ వీరాభిమాని అయితే తప్ప షంషేరా ఏ కోణంలోనూ మెప్పించదు