ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ చాలా కీలకం. పెద్ద చిన్న అనే తేడా లేకుండా అన్ని సినిమాలు రిలీజ్ కి పోటీ పడుతుంటాయి. ముఖ్యంగా బిగ్ స్టార్స్ మధ్య బాక్సాఫీస్ వార్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓవైపు సంక్రాంతి పండుగ.. మరోవైపు కొత్త సినిమాలు ఫ్యాన్స్, ప్రేక్షకులకు వచ్చే ఆ కిక్కే వేరు. అయితే.. ఇప్పటిదాకా సంక్రాంతి సీజన్లు ఒకలా జరిగితే.. ఈసారి రాబోయే సంక్రాంతి విషయంలో మాత్రం చాలా గందరగోళం మొదలైంది. ఒకటి రెండు కాదు.. ఏకంగా అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ డేట్స్ ని లాక్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ ముందునుండి రేసులో ఉన్న సినిమాలు కాకుండా.. కొత్తగా ఇంకొన్ని యాడ్ అవుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
సాధారణంగా సంక్రాంతి సీజన్ వస్తుందంటే కొన్ని నెలల ముందే రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంటారు. షూటింగ్ టైమ్ లో కుదరకపోతే.. కనీసం సినిమా ఎండింగ్ లో అంటే.. రిలీజ్ కి ఇంకా మూడు నాలుగు నెలలే టైమ్ ఉందన్నప్పుడు డేట్ ఫిక్స్ చేస్తుంటారు. కానీ.. వచ్చే 2024 సంక్రాంతి విషయంలో వరుసగా డేట్స్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటూ పోతున్నారు స్టార్స్. ఇప్పటికైతే దాదాపు ఆరు సినిమాల వరకు సంక్రాంతి బరిలో దిగుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ.. తీరా రిలీజ్ టైమ్ కి పోటీలో ఉండేవి ఏవో.. పోటీ నుండి తప్పుకునేవి ఏవో తెలియదు. సో.. వచ్చే సంక్రాంతికి రిలీజ్ ల మధ్య గందరగోళం ఉందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ప్రస్తుతానికి సంక్రాంతి రేసులో ముందే బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాయి మహేష్ బాబు గుంటూరు కారం, ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాలు. ఇప్పుడు కొత్తగా అదే వరుసలో రవితేజ ఈగల్ కూడా చేరింది. మరోవైపు కింగ్ నాగార్జున ‘నా సామిరంగా’ కూడా ఫిక్స్ అయ్యింది. ఇవేగాక.. విజయ్ దేవరకొండ 13, శివ కార్తికేయన్ అయలాన్ సినిమాలు పోటీ పడుతున్న వాతావరణం కనిపిస్తుంది. అయితే.. వీటిలో కొన్ని షూటింగ్ దశలోనే ఉన్నాయి. సో.. అప్పటికి వచ్చేవి ఏవో తెలియదు. ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ నుండి సలార్ వాయిదా పడటంతో.. అది మళ్ళీ డిసెంబర్ లో క్రిస్మస్ సందర్బంగా వస్తుందని అంటున్నారు. సలార్ వస్తే గనక.. వెంకటేష్ సైందవ్, నాని హాయ్ నాన్న సినిమాలు కూడా సంక్రాంతి వైపు అడుగులు వేసే అవకాశం లేకపోలేదు. సో.. 2024 సంక్రాంతి ఎలా ఉండబోతుందో చూడాలి. మరి సంక్రాంతి సినిమాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.