iDreamPost
iDreamPost
గత నెల విడుదలైన అజయ్ దేవగన్ కొత్త సినిమా రన్ వే 34 అమెజాన్ ప్రైమ్ లో వచ్చేసింది. మరి ఇందులో నెటిజెన్లు ఫైర్ అవ్వడానికి ఏముందంటారా. దీనికి కూడా కెజిఎఫ్ 2 తరహాలో పే పర్ వ్యూ మోడల్ లో 199 రూపాయల ధర నిర్ణయించడంతో వాళ్ళు భగ్గుమంటున్నారు. డబ్బులు కట్టి చూడటం మొదలుపెట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే దీన్ని పూర్తి చేయాలనే నిబంధం వాళ్లకు మరింత చిరెత్తుకొచ్చేలా చేస్తోంది. ఈ మాత్రం దానికి సంవత్సరానికి 1500 మేము ఎందుకు కట్టామని నిలదీస్తున్నారు. నిజానికి నిన్న కెజిఎఫ్ 2 ఫ్రీ స్ట్రీమింగ్ జరగాల్సి ఉంది. కానీ రెంటల్ విధానాన్ని మరింత క్యాష్ చేసుకోవడం కోసం ప్రైమ్ దాన్ని వాయిదా వేసిందట.
ఈ రన్ వే 34 థియేటర్లలో పెద్దగా ఆడిన మూవీ కాదు. యావరేజ్ అనిపించుకుంది. అజయ్ దేవగన్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ ఫ్లైట్ థ్రిల్లర్ లో అమితాబ్ బచ్చన్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్, బోమన్ ఇరానీ లాంటి సీనియర్ క్యాస్టింగ్ ఉంది. ఇది నిజ జీవిత ఘటన ఆధారంగా రూపొందిన చిత్రం. దుబాయ్ నుంచి కోచికి బయలుదేరిన ఫ్లైట్ కు వాతావరణం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ల్యాండింగ్ విషయంలో పైలట్ తీసుకున్న నిర్ణయంతో 150 ప్రయాణికుల ప్రాణాలు రిస్క్ లో పడతాయి. అయినా రిస్క్ చేయి ఎలాగోలా విమానాన్ని ల్యాండింగ్ చేయిస్తాడు. దీన్ని సీరియస్ గా తీసుకున్న పై అధికారులు విచారణ చేస్తారు.
పైలట్ కున్న తాగుడు అలవాటుతో పాటు సిగరెట్, రాత్రిళ్ళు పబ్ కు వెళ్లడం లాంటి వాటిని చూపి బాద్యుణ్ని చేసే ప్రయత్నం జరుగుతుంది. దేవుడిలా కొలిచే తనకు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడంతో అతను దాన్ని ఎలా ఎదురుకున్నాడనేదే అసలు కథ. ఓటిటిలో మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉన్న ఈ రన్ వే 34ని ఎక్స్ ట్రా డబ్బులిచ్చి చూడమని చెప్పడం బ్యాక్ ఫైర్ అవుతోంది. దీంతో పైరసీతో పాటు వివిధ రకాల ఆన్ లైన్ యాప్స్ లో దీన్ని ఉచితంగా చూసే పనిలో పడ్డారు వాటి మీద అవగాహన ఉన్న మూవీ లవర్స్. అసలు ప్రైమ్ ఈ దోపిడీని జనానికి అలవాటు చేసేందుకు ప్రయత్నిస్తోందో లేక ఇంకేదైనా స్ట్రాటజీ ఉందో వేచి చూడాలి.