టాలీవుడ్ లోనే కాకుండా.. ఏపీ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారిన రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా టీజర్ రానే వచ్చింది. ఏపీ రాజకీయ పరిణామాలపై వ్యూహం పేరిట సినిమా తీస్తాను అని ఆర్జీవీ ప్రకటించినప్పటి నుంచి సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. అసలు ఎలా తీస్తాడు? ఏ విషయాలను టచ్ చేస్తాడు? అంటూ పలు ప్రశ్నలు వెల్లు వెత్తాయి. ఆ ప్రశ్నలు అన్నింటికి ఈ టీజర్ లో సమాధానాలు దొరికాయనే చెప్పచ్చు. అంతేకాకుండా వ్యూహం సినిమా ఎలా ఉండబోతుందో కూడా ఆర్జీవీ ఒక క్లారిటీ ఇచ్చేశాడు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం నుంచి ఏపీలో ఏర్పడిన పరిస్థితులు, సీఎం జగన్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? ఎలా నిలబడ్డారు? ఆయన మిత్రులు ఎవరు? శత్రువులు ఎవరు? ఇలా ప్రతి అంశాన్ని టచ్ చేసినట్లు కనిపించింది. అధికారం కోసం జరిగిన ఒక ఆట.. అన్నట్లు చెస్ బోర్డులో రాజుని సింబాలిక్ గా చూపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సినిమా తీస్తున్నామంటూ ఇప్పటికే ప్రకటించారు.
ఆర్జీవీ సినిమాల్లో అందరూ అంగీకరించాల్సిన విషయం ఏంటంటే.. నిజ జీవితంలో వారు ఎలా ఉంటారో.. అచ్చు అలాంటి వారినే ఎంపిక చేసి పాత్రలు పోషించేలా చేస్తాడు. మీకు వెండితెర మీద కూడా నిజమైన వ్యక్తులను చూస్తున్నట్లే అనిపిస్తుంది. ఇంక ఈ వ్యూహం సినిమా అభిమానులకు పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాని ఆర్జీవీ డెన్, రామదూత క్రియేషన్స్ తరఫున ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అతి త్వరలోనే సినిమాని విడుదల చేస్తామంటూ చెప్పుకొచ్చారు.