iDreamPost
iDreamPost
అప్పుడెప్పుడో ముప్పై మూడు సంవత్సరాల క్రితం రాజశేఖర్ ని అంకుశంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూశాక ఆయనకు ప్రేక్షకులు యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే బిరుదు ఇచ్చారు. దానికి తగ్గట్టే అలాంటి పవర్ ఫుల్ వేషాలు చాలా వేసి ఫాలోయింగ్ పెంచుకుంటూ వచ్చారు. అయితే తన సమకాలీకులైన సీనియర్ హీరోల్లా సెకండ్ ఇన్నింగ్స్ ఆశించినంత స్థాయిలో జరగడం లేదు. ఆ మధ్య గరుడవేగ హిట్ అయ్యింది కానీ నిర్మాత లాభ పడింది పెద్దగా లేదు. కల్కి ఫ్లాప్ కావడం మార్కెట్ ని ఇంకాస్త తగ్గించింది. మళ్ళీ కొంత గ్యాప్ తీసుకుని భార్య జీవిత దర్శకత్వంలో చేసిన శేఖర్ ఈ నెల 20న విడుదల కానుంది. ఇందాక ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఇది మలయాళం హిట్ మూవీ జోసెఫ్ కు రీమేక్. రిటైర్మెంట్ తీసుకున్న పోలీస్ అధికారి శేఖర్(రాజశేఖర్) వృత్తి మానేసినా కేసుల విషయంలో డిపార్ట్ మెంట్ కు సహాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఇతన్నుంచి విడిపోయిన మాజీ భార్య యాక్సిడెంట్ కు గురై ప్రాణాలు కోల్పోతుంది. మొదట సహజ మరణంగా అనిపించినా దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని, ఎందరో అమాయకులు బలయ్యారని శేఖర్ కు అర్థమవుతుంది. దీంతో తనే స్వయంగా రంగంలో దిగుతాడు. దీని వెనుక ఉన్న మాఫియా గుట్టు బయట పడుతుంది. అసలు ఒకే రోడ్డులో అన్ని ప్రమాదాల వెనుక ఉన్న కుట్రదారులు ఎవరు లాంటి ప్రశ్నలకు సమాధానమే సినిమా
ఒరిజినల్ వెర్షన్ ని దాదాపుగా ఫాలో అయ్యారు. పెద్దగా మార్పులు చేసినట్టు కనిపించలేదు. తెల్లని జుట్టు గెడ్డంతో రాజశేఖర్ గెటప్ బాగుంది. వయసుకు తగ్గట్టు ఇలాంటి క్యారెక్టర్లు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. సాయికుమార్ చెప్పిన డబ్బింగ్ ఆకర్షణగా నిలవనుంది. కూతురు శివాని సినిమాలోనూ నిజ జీవిత పాత్ర చేయడం విశేషం. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చగా లక్ష్మి భూపాల సంభాషణలు అందించారు. ట్రైలర్ లో మంచి క్రైమ్ ఇంటెన్సిటీ కనిపిస్తోంది. బడ్జెట్ తక్కువే అయినా విజువల్స్ డీసెంట్ గా ఉన్నాయి. ప్రకాష్ రాజ్ క్యామియో ఉంది. మరి ఈ శేఖర్ హీరో రాజశేఖర్ కోరుకున్న బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి