iDreamPost
android-app
ios-app

టాలీవుడ్‌లో అద్భుతం! నిర్మాతగా సినిమా తీసిన మహిళా రైతు!

  • Published Aug 06, 2024 | 2:57 PM Updated Updated Aug 06, 2024 | 2:57 PM

Prakasam Woman-Produce Movie: మనిషి విజయతీరాలకు చేరాలంటే సాధించాలనే తపన, పట్టుదలతో పాటు కృషి కూడా ఉండాలి. అప్పుడే సక్సెస్‌ మిమ్మల్ని వరిస్తుంది. ఇక్కడ మాటలన్నింటిని పాటించి.. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది ఓ సాధారణ మహిళ. ఆ వివరాలు..

Prakasam Woman-Produce Movie: మనిషి విజయతీరాలకు చేరాలంటే సాధించాలనే తపన, పట్టుదలతో పాటు కృషి కూడా ఉండాలి. అప్పుడే సక్సెస్‌ మిమ్మల్ని వరిస్తుంది. ఇక్కడ మాటలన్నింటిని పాటించి.. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది ఓ సాధారణ మహిళ. ఆ వివరాలు..

  • Published Aug 06, 2024 | 2:57 PMUpdated Aug 06, 2024 | 2:57 PM
టాలీవుడ్‌లో అద్భుతం! నిర్మాతగా సినిమా తీసిన మహిళా రైతు!

కృషి ఉంటే మనుషులు రుషలవుతారు.. మహా పురుషులవుతారు.. అని ఓ సినిమా కవి చెప్పిన మాటను నిజం చేసి చూపించింది ఓ సాధారణ మహిళ. సినిమాల మీద ఉన్న పిచ్చితో.. రాత్రింబవళ్లు కష్టపడి డబ్బులు సంపాదించి.. రూపాయి రూపాయి కూడబెట్టి.. చివరకు తన కలను సాకారం చేసుకుంది. సినిమా కల నెరవేర్చుకోవడం కోసం వ్యవసాయ కూలీ మొదలు.. టిఫిన్‌ సెంటర్‌ నిర్వహణ వరకు అన్ని పనులు చేసింది. కొంత డబ్బును కుటుంబానికి ఖర్చు చేస్తూ.. మిగిలిన మొత్తాన్ని తన సినిమా కల సాకారం చేసుకోవడం కోసం దాచింది. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 90 లక్షల రూపాయలు సంపాదించింది. ఆ తర్వాత సినిమా ఫీల్డ్‌లో ఎందరినో కలిసి.. తన కల గురించి చెప్పింది. ఎన్ని అవమానాలు ఎదురైనా సరే.. ధైర్యంగా నిలబడి.. తన కలను సాకారం చేసుకుంది. త్వరలోనే ఆమె నిర్మించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎందరికో ఆదర్శంగా నిలుస్తోన్న ఈ మహిళ స్ఫూర్తి గాధ మీ కోసం..

కాయకష్టం చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే ఓ సామాన్య మహిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పెద్దగా చదువుకోకపోయినా సరే.. మూవీస్‌ మీద పిచ్చితో.. సినిమా తీసి.. ప్రతి ఒక్కరి చేత ఔరా అనిపించింది. ఆమె ప్రకాశం జిల్లాకు చెందని చెన్నబోయిన వెంకట నర్సమ్మ. పెద్దగా చదువుకోలేదు.. వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే మహిళ. కానీ సినిమాలు అంటే విపరీతమైన పిచ్చి. చిన్నప్పుడు కనిగిరి శ్రీనివాస హాలులో బ్రహ్మంగారి జీవిత చరిత్ర చూసినప్పటి నుంచి ఆమెకు సినిమా పిచ్చి మొదలయ్యింది. పెళ్లయ్యేవరకు అది కొనసాగింది. పద్నాలుగో ఏట కొనకనమిట్ల దగ్గరున్న పెదారికట్లకు చెందిన వెంకటేశ్వర్లుతో నరసమ్మకు వివాహం అయ్యింది. పెళ్లి తర్వత కూడా తరచుగా భర్తతో కలిసి వెళ్లి సినిమాలు చూసేది. అలా పుట్టింటికి రా చెల్లి సినిమా చూసిన తర్వాత.. తను కూడా ఎప్పటికైనా సినిమా తీయాలని నిర్ణయించుకుంది.

డబ్బులు దాస్తూ..

సినిమా నిర్మాణం అంటే భారీ ఖర్చు ఉంటుందని తెలుసుకున్న నరసమ్మ.. అప్పటి నుంచి ఇంట్లో వాళ్లకు తెలియకుండా వంద, రెండొందలు, 1000 రూపాయల చొప్పున ఓ డబ్బాలో దాచడం మొదలు పెట్టింది. నరసమ్మకు మూడెకరాల పొలం, 70 గొర్రెలు, కొన్ని మేకలు, 30 గేదెలు ఉండేవి. అలా పొలం, పాడి పనులు చూసుకుంటూ.. డబ్బులు సంపాదించి.. దానిలో కొంత కుటుంబానికి, మిగతా మొత్తం సినిమాలకు దాచేది. 20 ఏళ్లుగా ఇలా డబ్బులు పొదుపు చేస్తూ వస్తోంది. ఇక ఇంట్లో తరచుగా సినిమా నిర్మాణం గురించి మాట్లాడుతూ ఉండటం చూసి.. నరసమ్మ భర్త, కొడుక్కి విసుగొచ్చి.. సినిమా తీయాలంటే ఎన్ని డబ్బులు ఖర్చువుతాయో తెలుసా.. నీ దగ్గర ఆ మొత్తం ఉన్నాయా అని ప్రశ్నించారు. ఎంత దాచావో వెళ్లి తీసుకురా అన్నారు.

అప్పుడు నరసమ్మ వెళ్లి డబ్బా తీసుకుని రాగా.. దాన్ని ఒపెన్‌ చేసి చూశారు. లోపల మొత్తం 29 లక్షల రూపాయల వరకు ఉన్నాయి. అది చూసి నరసమ్మ కొడుకు, భర్త షాక్‌ అయ్యారు. అయితే సినిమా తీయాలంటే ఈ మొత్తం సరిపోదు అన్నారు. దాంతో ఇంకా డబ్బులు సంపాదించే పనిలో పడింది నరసమ్మ. అలా మొత్తం 90 లక్షలు కూడబెట్టి.. ఆ తర్వాత సినిమా మొదలు పెట్టింది.

కొడుకు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు..

తన ప్రయాణం గురించి నరసమ్మ మాట్లాడుతూ.. ‘‘సినిమా తీయాలంటే నేను దాచిన 29 లక్షలు చాలవు.. మరింత డబ్బు కావాలని నా కొడుకు చెప్పాడు. దాంతో మరిన్ని డబ్బులు సంపాదించే పనిలో పడ్డాను. కూలికి వెళ్లాను.. చెరుకు రసం అమ్మనాఉ, టిఫిన్‌ బండి పెడ్డాను.. ఆఖరికి కరోనా సమయంలో కూడా అందరికి దూరంగా ఉంటూ.. ఊరి బయట రాగి జావ అమ్మాను. ఎంతో కష్టపడి.. బాగానే డబ్బు కూడబెట్టాను. ఇక నా సినిమా పిచ్చి చూసి.. నా కొడుకు నాతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లి పోయాడు. ఆ తర్వాత అతడిని వెతికి పట్టుకుని.. ఇంటికి తీసుకువచ్చాను. నా కల గురించి అర్థం అయ్యేలా చెప్పాను’’ అని చెప్పుకొచ్చింది.

‘‘నా పట్టుదల చూసి నా కొడుకు నన్ను నమ్మాడు.. నేను చెప్పనట్టు కథ రాశాడు. తర్వాత హైదరాబాద్‌ వెళ్లి సినిమా ఆఫీసుల్లో పని చేశాడు. చాలా మందిని కలిశాడు. చివరకు నటుడు రవిబాబును కలిస్తే ఆయన సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. నా పట్టుదను ప్రశంసించారు. మాతంగి ఆచారం గురించి, ఆడవాళ్ల జీవితం గురించి సినిమా చేశాం. స్పిరిట్‌(ఈజ్‌ నాట్‌ వన్‌) అనే టైటిల్‌తో ఈ సినిమా తర్వలోనే విడుదల కానుంది. ప్రస్తుతం నా భర్త, కొడుకు ఆ పనులు చూసుకుంటున్నారు. కుటుంబ పోషణ కోసం నేను టిఫిన్‌ బండి నడుపుతున్నాను’’ అని చెప్పుకొచ్చింది. కల నెరవేర్చుకోవడం కోసం ఆమె ఎంత కష్టపడిందో తెలుసుకున్న ప్రతి వారి ఆమె మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.