వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ మడోన్నా ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ స్వయంగా వెల్లడించారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆరు పదుల వయసులోనూ తన అద్భుతమైన గాత్రంతో.. ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది మడోన్నా. ఊహించని విధంగా ఆమె అస్వస్థతకు గురికావడంతో.. హుటాహుటిన ఆమెను న్యూయార్క్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
మడోన్నా.. పాప్ సింగింగ్ ప్రపంచానికి యువరాణి. తన మధురమైన గొంతుతో వరల్డ్ వైడ్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కాగా.. ఆరు పదుల వయసు దాటినా.. తన గాత్రంలో ఏ మాత్రం తేడా లేదు. ఇక మరికొన్ని రోజుల్లో సంగీత ప్రపంచలోకి అడుగుపెట్టి 40 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది మడోన్నా. ఈ సందర్భంగా వరల్డ్ టూర్ కు ప్లాన్ చేసింది. కానీ అనూహ్యంగా ఆమె తీవ్ర అస్వస్థతకు లోనై.. ఆస్పత్రి పాలయ్యింది. ఆమె శరీరం స్పందించలేని స్థితిని గుర్తించి.. వెంటనే ఆమెను న్యూయార్క్ లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గత వారం రోజులుగా మడోన్నా ఐసీయూలో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఆమె తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు గురైందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మడోన్నా అరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని, ఆమె మేనేజర్ తెలిపాడు. మడోన్నా అస్వస్థతకు గురికావడంతో.. వరల్డ్ టూర్ తో పాటుగా, మిగతా ప్రొగ్రామ్స్ లన్నింటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా మేనేజర్ తెలియజేశాడు. ఈ పర్యటన జూలై 15న వాంకోవర్ లో ప్రారంభం అయ్యి.. యూఎస్, యూరప్ వెళ్లే ముందు డిసెంబర్ 1న అమస్టర్ డామ్ లో ముగుస్తుంది. ప్రస్తుతం మడోన్నాకు తోడుగా ఆమె కూతురు లియోన్ ఉన్నట్లు సమాచారం. కాగా.. మడోన్నా కోలుకున్నట్లు, హస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు కొన్ని ప్రముఖ న్యూస్ ఛానల్స్ పేర్కొంటున్నాయి.